అవినీతి ఎస్సై పరుగో పరుగు! ..20 నిమిషాలు ఛేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ

అవినీతి ఎస్సై పరుగో పరుగు! ..20 నిమిషాలు ఛేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ
  • మెదక్ జిల్లా టేక్మాల్​లో ఘటన 
  • రైతు నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై రాజేశ్
  • పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు

మెదక్/టేక్మాల్, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకున్న ఓ ఎస్సై ఏసీబీ అధికారులను గమనించిన స్టేషన్  వెనుక వైపు నుంచి పారిపోగా.. ఏసీబీ అధికారులు 20 నిమిషాలు ఛేజ్​ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్​లో మంగళవారం జరిగింది. ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్​స్టేషన్ కు చేరుకొని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్​ తెలిపిన వివరాల ప్రకారం.. హార్వెస్టర్ కు సంబంధించిన బ్యాటరీ, స్పేర్​ పార్ట్స్​ దొంగిలించిన కేసును కాంప్రమైజ్​ చేసేందుకు ఓ రైతు వద్ద టేక్మాల్​ ఎస్సై రాజేశ్ ​రూ.40  వేలు డిమాండ్​ చేశాడు. ఈ నెల 5న రూ.10 వేలు వేరే వ్యక్తికి ఫోన్​ పే చేయించుకున్నాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని తెలిపాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పోలీస్​స్టేషన్​లో ఎస్సైకి రూ.30 వేలు ఇచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు స్టేషన్​లోకి రావడంతో, వారిని గమనించిన ఎస్సై పోలీస్​స్టేషన్​ బిల్డింగ్​ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికీ సజ్జ మీదకు దూకాడు. అక్కడి నుంచి కిందకు దూకి పొలాల్లోకి పరుగు తీశాడు. దీంతో ఏసీబీ అధికారులు అతడిని 20 నిమిషాల పాటు ఛేజ్​ చేసి పట్టుకున్నారు. అనంతరం ఎస్సైని పోలీస్​స్టేషన్ కు తీసుకువచ్చి కెమికల్​ టెస్ట్​ చేశారు. ఎస్సైని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో మండలకేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్టేషన్ కు చేరుకొని పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎస్సై రాజేశ్​​అవినీతిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.


రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన సికింద్రాబాద్​ సర్వేయర్, చైన్​మన్

పద్మారావునగర్: రూ. లక్ష లంచం తీసుకుంటూ సికింద్రాబాద్  తహసీల్దార్  ఆఫీస్​లో పని చేసే సర్వేయర్, చైన్​మన్​ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్స్  హాస్పిటల్  రోడ్ లో బాధితుడు కొంత భూమిని లీజుకు తీసుకొని హోటల్  నడిపిస్తున్నాడు. ఆ భూమి పార్కుకు చెందిందని, భూ సర్వేలో రిపోర్ట్  మార్చడానికి సర్వేయర్  కలువ కిరణ్ కుమార్  బాధితుడిని రూ.3 లక్షలు లంచం డిమాండ్​ చేశాడు. 

బాధితుడు రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ. లక్ష ఇవ్వడానికి సికింద్రాబాద్  తహసీల్దార్​ ఆఫీస్ కు రాగా, పార్కింగ్ లోని 999 నెంబర్  ఇన్నోవా కారులో డబ్బులు పెట్టమని సర్వేయర్​ సూచించాడు. నిజామాబాద్ లో నివాసం ఉండే కిరణ్  ఇంటికి వెళ్లేందుకు బోయిన్​పల్లి బస్టాప్  వద్ద ఎదురు చూస్తూ.. కారులో ఉన్న డబ్బులు చైన్ మన్  భాస్కర్ ద్వారా తెప్పించుకున్నాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు బోయిన్​పల్లి వద్ద ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. 

సికింద్రాబాద్  తహసీల్దార్​ ఆఫీస్​తో పాటు నిజామాబాద్ లోని సర్వేయర్  కిరణ్  నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారిని నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

గోపాల్​పేటలో విద్యుత్ ఏఈ.. 

గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట విద్యుత్  శాఖ ఏఈ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్​పేట మండలం ఏదుల  గ్రామానికి చెందిన ఓ  రైతు ట్రాన్స్​ఫార్మర్​ మంజూరు కోసం ఏఈ హర్షవర్ధన్ ను సంప్రదించగా, రూ.50 వేలు డిమాండ్  చేశాడు.

 అంత ఇవ్వలేనని చెప్పగా, రూ.40 వేలు ఇవ్వాలని ముందుగా రూ.20 వేలు, ట్రాన్స్​ఫార్మర్​ వచ్చాక రూ.20 వేలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఏఈ హర్షవర్ధన్ కు రూ.20 వేలు లంచం ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.