ఇండియన్ టెక్కీలకు యాక్సెంచర్ శుభవార్త.. ఏఐ సేవల గ్రోత్ సూపర్

ఇండియన్ టెక్కీలకు యాక్సెంచర్ శుభవార్త.. ఏఐ సేవల గ్రోత్ సూపర్

ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ.. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు భారతీయ ఐటీ సేవల రంగానికి కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ సేవల్లో కనిపిస్తున్న వృద్ధి.. రాబోయే రోజుల్లో భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యాక్సెంచర్ తన రెవెన్యూ గైడెన్స్‌ను పెంచడం ద్వారా మార్కెట్లో నెలకొన్న ఆందోళనలను పటాపంచలు చేసేసింది. దీంతో ఇన్నాళ్లుగా జాబ్ ఇన్ సెక్యూరిటీకి ఏఐ కారణం అంటూ వచ్చిన ఆందోళనలకు చెక్ పడటంతో టెక్ నిపుణులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

యాక్సెంచర్ గత త్రైమాసికంలో 18 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా.. వరుసగా మూడవసారి 20 బిలియన్ డాలర్లకు పైగా కొత్త బుకింగ్స్‌ను సాధించింది. క్లయింట్లు తమ బడ్జెట్‌లను సాధారణ సాఫ్ట్‌వేర్ సేవల నుండి ఏఐ ఆధారిత పరివర్తన వైపు మళ్లిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ వెల్లడించారు. ఇది కేవలం యాక్సెంచర్‌కే కాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీలకు కూడా సానుకూల సంకేతం అని చెప్పుకోవచ్చు.

ఇటీవల ఆంత్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ టూల్స్ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుందని ఇన్వెస్టర్లు భయపడ్డారు. దీనివల్ల భారతీయ ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే తాజా పరిస్థితులు మరోలా ఉన్నాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణల ప్రకారం.. ఏఐ వల్ల ఐటీ సేవల కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం లేకపోగా, కొత్త రకమైన ప్రాజెక్టులు పెరిగే అవకాశం ఉందని తేలింది. ఈ వార్తలతో ఐటీ స్టాక్స్ మళ్లీ లాభాల బాట పట్టాయి.

యాక్సెంచర్ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. భారతీయ కంపెనీలు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యాక్సెంచర్ తన బిజినెస్ మోడల్‌ను వేగంగా ఏఐకి అనుగుణంగా మార్చుకుంది. భారతీయ ఐటీ సంస్థలు కూడా తమ సామర్థ్యాలను ఆదాయంగా మార్చుకోవడంలో వేగం పెంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి ఏఐ ప్రాజెక్టులు అధికంగా వస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. 

గల్ఫ్ వార్ ఏఐ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2026 నాటికి ఐటీ రంగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని, జనరేటివ్ ఏఐ ఈ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌లా పనిచేస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉద్యోగాలు పోతాయి, కొత్త జాబ్స్ రావు అనే ఆందోళల్లో వాస్తవం చాలా తక్కువేనని తేలిపోయింది.