అగ్నిపథ్.. సికింద్రాబాద్‌‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అగ్నిపథ్.. సికింద్రాబాద్‌‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 05వ తేదీ నుంచి సెప్టెంబర్ 03వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 01వ తేదీ నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. టెక్నికల్, క్లర్స్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగాల్లో పదో తరగతి పాస్ అయి ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అక్టోబర్ 15వ తేదీ నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపింది. www.joinindianarmy.nic.in వెబ్ సైట్ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

భారత త్రివిధ దళాల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ.. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, పోరాటాలు చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభ్యర్థులు విధ్వంసం సృష్టించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అగ్నిపథ్ ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్ ఉంటుందని.. సాధారణ రిక్రూట్ మెంట్ లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పై యువతకు రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది. యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి.