- కారుతో గుద్ది, కత్తితో పొడిచి చంపిన మేనల్లుడు
- ఇందల్వాయి మండలం లింగాపూర్‌లో ఘటన
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి (55) హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి కారులో వెళ్తున్న గోపిపై అతడి మేనల్లుడితో పాటు మరికొందరు దాడి చేసి చంపేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల గొడవలతో పాటు పాతకక్షలే హత్యకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... ఇందల్వాయి మండలం గౌరారం పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి గోపి గతంలో పీపుల్స్‌వార్‌లో పనిచేశారు.
లొంగిపోయిన తర్వాత మండలాల విభజనకు ముందు ధర్పల్లి ఎంపీపీగా పనిచేయగా.. అతడి మొదటి భార్య లక్ష్మీ గౌరారం సర్పంచ్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గోపి రెండో భార్య హేమలత, అతడి మేనల్లుడు సతీష్ పోటీలో నిలవడంతో హేమలత విజయం సాధించింది. అప్పటికే ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉండగా, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనకు అవకాశం ఇవ్వాలని కోరినా గోపి పట్టించుకోలేదని సతీష్ కోపం పెంచుకున్నాడు. మరో వైపు రెండు రోజుల కింద ఓ బోరుబావి వివాదంలో జోక్యం చేసుకొని తనకు నష్టం కలిగించాడనే ఆగ్రహంతో గోపిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గౌరారంలో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్న అనంతరం ఒంటరిగా వచ్చే టైంలో గోపిపై దాడి చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గోపి తన ఫార్చునర్ కారులో లింగాపూర్ గ్రామానికి వస్తుండగా.. సతీశ్ మరికొందరితో కలిసి ఆల్టో కారులో వచ్చి వెనుక నుంచి ఢీకొట్టాడు.
అనంతరం కారు దిగిన గోపిని కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన తర్వాత సతీశ్ ఇందల్వాయి స్టేషన్‌కు వెళ్లి లొంగిపోగా.. అతడికి సహకరించిన వ్యక్తులు పరార్ అయ్యారు. గోపి హత్యతో గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గోపి హత్య విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం సాయంత్రం గ్రామానికి వచ్చి గోపి డెడ్‌బాడీ వద్ద నివాళి అర్పించారు. హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు.
