
- సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి శివారులోని ఆరేన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఘటన
సంగారెడ్డి, వెలుగు : కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి శివారులోని ఆరేన్ లైఫ్ సైన్స్‌స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామ శివారులోని ని కంపెనీలో బుధవారం రాత్రి కార్మికులు కెమికల్ మిక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న శివారెడ్డి, శ్రీనివాస్, దివాకర్, సింహాచలం అనే కార్మికులపై రసాయనాలు పడ్డాయి.
కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలు కావడంతో వారిని వెంటనే సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం గాంధీ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గాయపడిన నలుగురిలో ఇద్దరు స్థానికులు కాగా మరో ఇద్దరు బీహార్, ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన కార్మికులను సీఐటీయూ నాయకులు పరామర్శించారు.