
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ORR)పై ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 16) తెల్లవారుజామున కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఅర్ఆర్ ఎగ్జిట్-13 నుండి ఎగ్జిట్-12 కు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రావిర్యాల ఎగ్జిట్-13 నుండి బోంగ్లూర్ ఎగ్జిట్-12 వైపు వెళ్తుండగా ఓఅర్ఆర్ పై ఆపిన కారును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కీసర మండలం భోగారం కు చెందిన శివకోటేశ్వర్ (27) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా 5 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారి వివరాలు వెల్లడించారు. గాయపడిన వారిలో బిల్డర్ కేకే సుబ్బారావు (భోగారం), శ్రీహరి (30), మహేష్ వర్మ (25), రాజేంద్ర (35) , రామకృష్ణ ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అధిబట్ల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.