రాజాసాబ్ సినిమా చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, ఇద్దరు కూతుళ్లకు గాయాలు

రాజాసాబ్ సినిమా చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి,  ఇద్దరు కూతుళ్లకు గాయాలు
  • ఎదురుగా వచ్చి కారును ఢీ కొట్టిన టోయింగ్ వెహికల్
  • ములుగు జిల్లా వాజేడులో విషాదం

ఏటూరు నాగారం, వెలుగు : సినిమా చూసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు స్పాట్ లో చనిపోగా, మరికొందరికి తీవ్రగాయాలైన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం జరిగింది.​  వివరాల్లోకెళ్తే.. వాజేడు మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి వీరభద్రరాజు (49), తన ఇద్దరు కూతుళ్లు మేఘన, మాధురి, తమ్ముడు సీతారామరాజు(మనోజ్)​, బాబాయి బుచ్చి గోపాలరాజుతో కలిసి కారులో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏటూరునాగారంలోని వెంకటేశ్వర టాకీస్ లో రాజాసాబ్​మూవీ చూసేందుకు బయలు దేరారు. 

రొయ్యూరు వద్ద భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నేషనల్ హైవే –-163పై టోయింగ్ వెహికల్ (ఏపీ12ఎల్​2715)  డ్రైవర్​ జాకీర్ హుస్సేన్  స్పీడ్ గా ఎదురుగా వచ్చి కారును ఢీ కొట్టాడు. దీంతో కారు, టోయింగ్​వెహికల్స్ రోడ్డు పక్కకు చెట్లపొదల్లోకి దూసుకెళ్లాయి. వీరభద్ర రాజు తలకు తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయాడు. అతని కూతుళ్లకు, తమ్ముడు సీతారామరాజుకు కాళ్లు, గోపాలరాజుకు కుడి చేయి, కుడి కాలు విరిగాయి. తండ్రి డెడ్ బాడీని చూసి లేవలేని స్థితిలో కూతుళ్లు విలపించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. 

ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి బాధితులను108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం వరంగల్​కు రెఫర్ చేశారు. మృతుడి తమ్ముడు కాకర్లపూడి వెంకటసత్య నరసింహారాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్​కుమార్​ తెలిపారు.