- సింగరేణి కార్మికులకు 40 లక్షల బీమా
- ఎస్బీఐతో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఏరియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్‌బీఐ, సింగరేణిల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో దాదాపు 35 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ ఒప్పందం వచ్చే నెల 4 నుంచి అమలులోకి వస్తుంది. సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం, ఎస్‌బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ సమక్షంలో హైదరాబాద్‌లోని ఎస్బీఐ హెడ్ ఆఫీస్ లో ఇరు సంస్థల ఉన్నతాధికారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. యాజమాన్యం విజ్ఞప్తి చేయడంతో కార్మికుల ఖాతాలన్నింటినీ కార్పొరేట్ శాలరీ అకౌంట్లుగా మార్చి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు అధికారులు తెలిపారు. రిటైర్డ్ కార్మికులకు కూడా బీమాను వర్తింపజేయాలని డైరెక్టర్ బలరాం కోరగా.. ప్రతిపాదనలు పంపాలని ఎస్‌బీఐ సీజీఎం ఆదేశించారు. త్వరలోనే ఇది కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
