ఔటర్ రింగ్ రోడ్.. యమ డేంజర్

ఔటర్ రింగ్ రోడ్.. యమ డేంజర్

ఔటర్ రింగ్ రోడ్డు అంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారిపోయింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన ఓఆర్​ఆర్​ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రింగ్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలతో ఏటా అనేకమంది మృత్యువాతపడుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది.

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల అడ్డాగా మారుతోంది. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అవి సత్పలితాలను ఇవ్వడం లేదు. ఇందుకు కారణం అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో ఓఆర్ఆర్ పై ప్రయాణం అంటేనే వాహణదారులకు వణుకుపుడుతోంది. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తరించిన ఓఆర్ఆర్ పై ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో సగటున 80 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఇందులో ఈ ఏడాది గత నెలలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు గడిచిన మూడు నెలల్లో జరిగిన 31 ప్రమాదాల్లో 14మంది మృతి చెందారు. మరో 32 మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యాయి. రెండేళ్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో గతేడాది సైబరాబాద్ లో మొత్తం 67 ప్రమాదాలు జరుగగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 63 మంది గాయాలపాలయ్యారు. దీంతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్‌‌ పరిధిలో 37 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 20 మందిమృతిగా 36 మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు జరిగిన 31 ప్రమాదాల్లో 14 మంది మృతిచెందగా 32 మందికి గాయాలయ్యాయి. ఈ  ప్రమాదాల్లో ఎక్కువ శాతం తెల్లవారుజామున 3 నుంచి 5గంటల సమయంలోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఔటర్పై జరిగిన కొన్ని ప్రమాదాలు
2019 జనవరి: కొంగర కలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జనవరి 11న ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా..  మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గంగావతికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్సులో ఔటర్ రింగ్ రోడ్ గుండా వస్తున్నారు. వీరు కొంగర కలాన్  రావిలాల సమీపంలోకి రాగానే డివైడర్ దాటుకుని వచ్చిన కారు వీరి అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న గంగావతికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వర రావు (60), అయన భార్య సుబ్బలక్ష్మి (55), ఏలూరుకు చెందిన డ్రైవర్ శివ (35) అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ (40), హేమచందర్ (38), తొషిష్ (34), మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన  కారు డ్రైవర్ మనోజ్ (34)కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

 2019 ఏప్రిల్:  ఔటర్ రింగ్ రోడ్డుపై గత నెలలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కొత్వాల్ గూడ దగ్గర అదుపుతప్పిన కారు ఎదురురుగా వస్తున్న మరో కారుపై పల్టీ కొట్టింది. రెండు కార్లు బలంగా ఢీకొనడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్​కు తరలించారు. నిజాంపేట్ నుండి శంషాబాద్ ఎయిర్‌‌ పోర్ట్ వైపు వెళ్తున్న కారుపై మరోకారు వేగంగా వచ్చి పడడంతో అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టి అటుగా వస్తున్న కారుపై దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు.

2018 నవంబర్: కీసర సమీపంలో రాంపల్లి- దయార బ్రిడ్జి వద్ద నవంబర్ 13న ఈ ప్రమాదం జరిగింది. దినేశ్‌‌ కుమార్‌‌ అనే వ్యక్తి తన భార్య సాగరిక, మూడు నెలల బాబు రుషీకేశ్‌‌తో కలిసి తన కారులో కీసర వైపు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రెయిలింగ్‌‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణం అతి వేగమేనని తెలుస్తోంది.

29 డెత్​స్పాట్స్​ … ప్రమాదాల నివారణలో భాగంగా 29 డేంజర్ స్పాట్స్ గుర్తించి ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. స్పీడ్ గన్ తో వాహనాల స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నారు. గతంలో గంటకు 120 కిలోమీటర్లు ఉన్న స్పీడ్ ను ఇప్పుడు100కు తగ్గించారు. రూల్స్​పాటించకుండావెళ్తున్న వాహనాలకు రూ.1400 జరిమానా విధిస్తున్నారు.