కూలీల‌కు వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం

కూలీల‌కు వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం

రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న లేబర్,కూలీలు ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలన్నారు రాచ‌కొండ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్. గృహ నిర్మాణ రంగంలో, మార్బుల్స్ షాపులలో, ఇటుక బట్టీలలో చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేస్తున్నారని తెలిపారు. వారందరూ కూడా పని లేక పోవడంతో వాళ్ల సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు. కార్మికులందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే వాళ్లకి భోజన సదుపాయం, వసతి సౌకర్యం కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రోడ్డుపై కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రయాణాలు చేయవద్దని చెప్పారు.గృహ నిర్మాణంలో పని చేసే కార్మికులకు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు భోజన సదుపాయం, వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారని.. కార్మికులు ఎలాంటి సమయంలోనైనా రాచకొండ కంట్రోల్ రూమ్ నెంబర్(9490617234..) కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

హోమ్ క్వారెంటైన్ లో ఉన్న వాళ్లు బయటికి వస్తున్నారని.. ఎవరు కూడా రాకూడదు ఒకవేళ వచ్చినట్లయితే వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామ‌న్నారు. బయటికి వచ్చిన వారిని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కు తరలిస్తామని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో ఎవరు బయటికి రాకూడదని చెప్పారు. ఎవరైనా వస్తే కేసులు నమోదు చేస్తామ‌ని చెప్పారు మ‌హేష్ భ‌గ‌వ‌త్.