GSDP ఫార్ములా ప్రకారం.. డీలిమిటేషన్ జరిగితే.. తెలంగాణలో కొత్తగా పెరిగే ఎంపీ సీట్లు ఎన్నంటే..

GSDP ఫార్ములా ప్రకారం.. డీలిమిటేషన్ జరిగితే.. తెలంగాణలో కొత్తగా పెరిగే ఎంపీ సీట్లు ఎన్నంటే..

హైదరాబాద్: డీలిమిటేషన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘జీఎస్డీపీ’ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) ఫార్ములా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంటులో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్‌ ప్రతిపాదించారు. దేశ జీడీపీలో అత్యధికంగా 13.77 శాతం వాటా ఉన్న మహారాష్ట్రకు ఈ పూల్ నుంచి అత్యధికంగా 35 సీట్లు అదనంగా లభిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రస్తుతం 17 సీట్లున్న తెలంగాణకు అదనంగా మరో 13 సీట్లు పెరిగి మొత్తం 30  స్థానాలకు చేరుకుంటుంది.

దేశ జీడీపీలో 5.03 శాతం వాటా ఉన్న ఏపీకి 13 సీట్లు పెరిగి 25 నుంచి 38కి చేరుకుంటాయి. అలాగే 9.08 శాతం వాటా ఉన్న తమిళనాడుకు 23 సీట్లు పెరిగి తమిళనాడు 39 నుంచి 62కి, 8.46 శాతం వాటా ఉన్న గుజరాత్‌కు 22 సీట్లు పెరిగి  26 సీట్ల నుంచి 48కి,  మహారాష్ట్ర 35 సీట్లు పెరిగి 48 నుంచి 83కి, 8.41 శాతం వాటా ఉన్న కర్నాటక 21 సీట్లు పెరిగి 28  నుంచి 49కి చేరుకుంటాయి. 3.63 శాతం వాటా ఉన్న కేరళకు 9 సీట్లు దక్కుతాయి.

ఇలా దేశ జీడీపీలో ఆయా రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసే శాతాన్ని బట్టి అదనపు సీట్లను కేటాయిస్తేనే,  కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఈ రాష్ట్రాల మద్దతు తప్పనిసరి అవుతుంది. జనాభా సాకుతో సంపద సృష్టించే రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపర్చకుండా ఉండాలంటే ఈ ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ సీట్ల కేటాయింపు ఒక్కటే మార్గమని  వాదిస్తున్నారు.

►ALSO READ | డీలిమిటేషన్‌ ప్రక్రియపై గందరగోళం.. ‘జీఎస్డీపీ’ ఫార్ములాను సూచించిన సీఎం రేవంత్.. అంటే ఏంటంటే..

ఈ కొత్త ఫార్ములా ప్రకారం.. యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లకు మరో 29 పెరిగి 109కి చేరుకుంటుంది. రాజస్థాన్‌లో 16 సీట్లు పెరిగి 41కి, మధ్యప్రదేశ్‌లో 14 సీట్లు పెరిగి 43కి చేరుకుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో 13 సీట్ల పెరుగుదలతో 55కి, హర్యానాలో 11 సీట్లు పెరిగి 21కి స్థానాలు పెరుగుతాయి. ఇక బిహార్లో 10 సీట్లు పెరిగి 50కి, ఒడిశాలో 8 సీట్లు పెరిగి 29కి, పంజాబ్‌లో 7 సీట్లు పెరిగి 20కి చేరుకుంటాయి.

ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో 27 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 543 సీట్ల సమయంలో రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ అంతరం మరీ విపరీతంగా పెరిగిపోకుండా ఉంటుంది. సంఖ్య పెరిగినా, సభలో దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ బలం తగ్గిపోకుండా చూడటమే ఈ వ్యూహంలోని అసలు రహస్యం.