హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి ఎండోక్రినాలజిస్ట్, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కిని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్లో ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరుగు ప్రయాణంలో న్యూయార్క్‌కు వస్తుండగా సుచి యాష్కీ కారు ప్రమాదానికి గురైంది.
వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ సుచి యాష్కికి రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మధుయాష్కీ గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కాన్వకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు. కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసే క్రమంలో లగేజీ ఎక్కువ ఉండటంతో.. డాక్టర్ సూచి, మధుయాష్కి వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
