
న్యూఢిల్లీ: ఆర్బీఐ డేటా ప్రకారం, కిందటి నెల 31తో ముగిసిన వారానికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు 4.837 బిలియన్ల డాలర్లు పెరిగి ఆల్-టైమ్ హై 651.51 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. అయితే మే 31తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు 212 మిలియన్ల డాలర్లు తగ్గి 56.501 బిలియన్లకు చేరాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కు లు (ఎస్డీఆర్లు) 17 మిలియన్ల డాలర్లు తగ్గి 18.118 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.
మునుపటి రిపోర్టింగ్ వారంలో, మొత్తం నిల్వలు 2.027 బిలియన్ల డాలర్లు తగ్గి 646.673 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత నెల పదో తేదీన దీని విలువ 648.87 బిలియన్ల డాలర్లు ఉంది. ఈ విషయమై పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన జీడీపీ వృద్ధి, సమర్థవంతమైన విధాన కార్యక్రమాలు, మంచి ద్రవ్య విధానం కారణంగా భారతదేశ ఫారెక్స్ నిల్వలు సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకు న్నాయని చెప్పారు.