ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలకు సిద్ధమవుతున్న రాష్ట్రం

 ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలకు సిద్ధమవుతున్న రాష్ట్రం
  • ఆపరేషన్ ప్రొటోకాల్ పై 28 నుంచి విచారణ
  • ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలకు సిద్ధమవుతున్న రాష్ట్రం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  బ్రజేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ 2) ప్రకారమే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీళ్లు మళ్లీ పంచేందుకు ఏర్పాటైన బ్రజేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఎదుట వాదనలు వినిపించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మెమోను త్వరలోనే ట్రిబ్యునల్‌‌‌‌లో ఫైల్‌‌‌‌ చేయనుంది. బచావత్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ 1) 75 శాతం డిపెండబులిటీ వద్ద కృష్ణాలో 2,060 టీఎంసీల నికర జలాలు ఉన్నట్టు లెక్కతేల్చి వాటిని కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీకి పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు దక్కాయి. అయితే, బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ నదిలో 47 ఏళ్ల ప్రవాహాలను లెక్కలోకి తీసుకొని 65 శాతం డిపెండబులిటీ వద్ద 2,578 టీఎంసీల నికర జలాలు ఉన్నట్టుగా నిర్దారించింది. ఇందులో ఉమ్మడి ఏపీకి 1,001 టీఎంసీల వాటా దక్కుతుందని తేల్చింది. కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీల వాటా ఉన్నట్టుగా చెప్పింది.

మెమోను సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు 
బచావత్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ప్రకారం దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకే మిగులు జలాలపై హక్కులు ఉంటాయని, బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ నిర్ణయించిన మిగులు (సర్‌‌‌‌ప్లస్‌‌‌‌) జలాల్లో కర్నాటకకు 105, మహారాష్ట్రకు 35 టీఎంసీలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఆదేశాలపై స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఏపీ పిటిషన్‌‌‌‌లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్‌‌‌‌ అయ్యింది. ఈ పిటిషన్‌‌‌‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌లో పేర్కొన్న ఎస్‌‌‌‌ఎల్బీసీ టన్నెల్‌‌‌‌ ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్‌‌‌‌ స్కీంలతో పాటు తమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్‌‌‌‌ విచారణలో చేర్చాలని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మెమోను సిద్ధం చేయడంలో ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. వచ్చే వారంలో మెమోను ఫైల్‌‌‌‌ చేసే అవకాశముంది. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌‌‌‌ విచారణలో దీనిని ప్రస్తావించి, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.