దేశంలో ఎక్కువ పెట్రోల్ రేట్లలో తెలంగాణది నాలుగో స్థానం

దేశంలో ఎక్కువ పెట్రోల్ రేట్లలో తెలంగాణది నాలుగో స్థానం
  • 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దిగొచ్చిన ధరలు
  • కేంద్రం సూచనతో వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు
  • తెలంగాణ మాత్రం ససేమిరా.. పెట్రోల్​ రూ.108.20
  • దేశంలో ఎక్కువ రేట్లలో నాలుగో స్థానంలో రాష్ట్రం

న్యూఢిల్లీ: కేంద్రం పెట్రోల్​పై రూ.5​, డీజిల్​పై రూ.10 ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించడంతో.. 17 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వ్యాట్​ను తగ్గించాయి. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాట్​ను తగ్గించలేదు. వ్యాట్​ను తగ్గించుకోవడంతో చాలా రాష్ట్రాల్లో లీటర్​ పెట్రోల్​ వంద రూపాయల కన్నా తక్కువకే వస్తోంది. మన రాష్ట్రంలో లీటర్​ పెట్రోల్​ధర రూ.108.20 ఉంటే.. మన పక్కనే ఉన్న కర్నాటకలో 100.14 ఉంది. పెట్రోల్​ రేట్లు ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం నాలుగో  స్థానంలో ఉంది. దీంతో రాష్ట్ర ప్రజలకు కేవలం ఎక్సైజ్​ డ్యూటీ మినహాయింపు ద్వారా మాత్రమే ఊరట కలిగింది.  సీఎం కేసీఆర్​ మాత్రం పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించబోమని స్పష్టం చేశారు. అత్యధికంగా రాజస్థాన్​లో లీటర్​ పెట్రోల్​పై రూ.111.10 వసూలు చేస్తుండగా.. ఆ తర్వాత ఏపీలో110.71గా ధర ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్​ 110.33గా ఉంది. డీజిల్​పై ఎక్కువ ధరలున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం రెండో స్థానంలో (లీటర్​కు రూ.94.62) ఉండగా.. మనకన్నా ముందు రాజస్థాన్​ ఉంది. అక్కడ లీటర్​ డీజిల్​ ధర రూ.95.71గా ఉంది.   

బీజేపీ, దాని మిత్రపక్షాలున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను ఎక్కువగా తగ్గించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్​ కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా.. పెట్రోల్​పై రూ.10, డీజిల్​పై రూ.5 తగ్గించింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్​ పెట్రోల్​ రూ.95.50కు దిగొచ్చింది. ఇటు డీజిల్​ ధర రూ.83.02కి తగ్గింది. అయితే, 12 రాష్ట్రాలు మాత్రం వ్యాట్​ను తగ్గించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, పశ్చిమబెంగాల్​, మహారాష్ట్ర, రాజస్థాన్​, ఒడిశా, చత్తీస్​గఢ్​, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మేఘాలయ, జార్ఖండ్​లు వ్యాట్​ తగ్గించలే. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్​ నికోబార్​ కూడా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన దగ్గర్నుంచి.. రోజువారీ పెట్రోల్​ ధరలు పెరగలేదు. ఏపీ అయితే ఎందుకు తగ్గించట్లేదో ప్రకటన రూపంలో వివరణ ఇచ్చింది.