‘మ్యూచువల్’ బదిలీ అయినోళ్లకు నో చాన్స్!

‘మ్యూచువల్’ బదిలీ అయినోళ్లకు నో చాన్స్!

హైదరాబాద్, వెలుగు : పరస్పర అంగీకారంతో వివిధ జిల్లాలకు బదిలీ అయిన టీచర్లకు, ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్​ఫర్స్​లో ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు జీవో 317తో బదిలీ అయిన వారికే ట్రాన్స్​ఫర్లకు సర్కార్ చాన్స్ ఇచ్చింది. ఆదివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. రాత్రి దాకా 2,866కు పైగా అప్లికేషన్లు వచ్చాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ప్రకటించారు. అత్యధికంగా రంగారెడ్డి నుంచి 195, అతి తక్కువగా జోగులాంబ గద్వాల నుంచి 18 అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఖమ్మం నుంచి 176, కరీంనగర్​ నుంచి 158 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. 

నేడు స్పౌజ్ బదిలీలపై స్పష్టత

రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారంతా బదిలీలకు అప్లై చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన సూచనలతో 59,909 మంది దరఖాస్తు చేసుకున్నారు. జీవో 317తో జిల్లాలు మారిన వారంతా అప్లై చేసుకోవచ్చని సర్కారు ఉత్తర్వులు ఇవ్వడంతో.. స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు అయిన వారూ దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ, మ్యూచువల్ బదిలీలు పొందిన వారికి మళ్లీ చాన్స్ లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. స్పౌజ్ బదిలీలపైనా సోమవారం స్పష్టత ఇస్తామని పేర్కొంటున్నాయి. అయితే, స్పౌజ్ వారికి మళ్లీ అవకాశం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. సుమారు 1,500 మంది వరకు మ్యూచువల్ బదిలీలు పొందగా, వారిలో చాలామంది హెచ్ఆర్ఏ ప్లేస్​లే ఎంచుకున్నారు. కొందరు సొంత జిల్లాకు రావాలనే ఆకాంక్షతో, దూరప్రాంతాలకూ వెళ్లారు. అలాంటి వారు సుమారు 200లకు మించి ఉండరని టీచర్ల సంఘాలు చెబుతున్నాయి. వారికీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.