రూ.22 కోసం కొట్టి చంపిండు.. తోటి కూలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

  రూ.22  కోసం కొట్టి చంపిండు.. తోటి కూలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

మెదక్​ (చేగుంట), వెలుగు: బాకీ డబ్బుల కోసం తోటి కూలిని కొట్టి చంపిన కేసులో నిందితుడిని మెదక్ జిల్లా చేగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ ​డీఎస్పీ నరేందర్​గౌడ్ ​శనివారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. యూపీలోని ఘాజీపూర్​కు చెందిన మహమ్మద్​ సిరాజ్(30), మహేశ్ కుమార్ బర్మా(23), చేగుంట మండలం అనంతసాగర్ శివారులోని సప్తగిరి ఫార్మా కంపెనీలో కొంతకాలంగా కూలీలుగా చేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నారు. ఈ నెల15న ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో మహేశ్​తన బాకీ డబ్బులు రూ. 22 ఇవ్వాలని సిరాజ్ పై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవకు దారితీసింది.  మహేశ్ కుమార్ కోపంతో సిరాజ్  ​తలను చింతచెట్టుకు కొట్టి, పెద్దరాయిని తెచ్చి తలపై 4, 5 సార్లు కొట్టి చంపేసి పారిపోయాడు. మృతుడి రూమ్ మేట్ రవి కుమార్​ ఫిర్యాదుతో చేగుంట పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ సీఐ రంగకృష్ణ, చేగుంట ఎస్ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేస్తుండగా.. మాసాయిపేట శివారులోని దాబా వద్ద మహేశ్​ కుమార్​ యూపీకి పారిపోయేందుకు చూస్తుండగా వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు. సిరాజ్ ను తనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద రక్తపు మరకల దుస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.