అత్తాపూర్ లో మాటలు రాని.. దివ్యాంగురాలిపై లైంగికదాడి.. రెండు రోజుల్లో నిందితుడి అరెస్ట్

అత్తాపూర్ లో మాటలు రాని.. దివ్యాంగురాలిపై లైంగికదాడి.. రెండు రోజుల్లో నిందితుడి అరెస్ట్

అత్తాపూర్, వెలుగు : ఏ కష్టమొచ్చినా నోరు విప్పి చెప్పుకోలేదు. అడుగు తీసి అడుగు వేయలేదు. అలాంటి ఓ యువతిపై కన్నేసిన ఓ కామాంధుడు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి..నోరు మూసి అఘాయిత్యం చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్​చేసి కటకటాల్లోకి నెట్టారు. బార్కస్​లోని షాయ్​నగర్​కు చెందిన మొహమ్మద్‌ అఖీల్‌(35)కు పెండ్లయి ముగ్గురు పిల్లలున్నారు. మద్యానికి బానిసై అందరితోనూ అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో భార్య అతడిని వదిలేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి పోయింది. అఖీల్‌కు వరుసకు సోదరి అయ్యే మహిళ హసన్‌నగర్‌లో భర్త, మామ, కూతురు, మూగ, దివ్యాంగురాలైన ఆడపడుచుతో కలిసి ఉంటోంది. 

అఖీల్‌ తరచూ తన సోదరి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు నిందితుడి సోదరి బ్యాంకుకు వెళ్లగా మిగతా వాళ్లు వివిధ పనుల కోసం బయటకు వెళ్లారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది తెలుసుకున్న అఖీల్‌ ఇంటికి వచ్చి తలుపులు వేశాడు. బాధితురాలు అరవకుండా ఆమె నోరు మూసి లైంగికదాడి చేశాడు. అప్పుడే నిందితుడి సోదరి ఇంటికి వచ్చింది. గడియ తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బాధితురాలు బట్టలు లేకుండా మూగగా రోదిస్తూ ఉంది. 

నిందితుడు తన సోదరిని చూసి ‘మాఫ్​కరో గల్​తీ హోగయా’ అని బతిమిలాడుకున్నాడు. బాధితురాలు పట్టలేని కోపంతో అతడిని కొట్టడానికి ప్రయత్నించగా తోసేసి పరారయ్యాడు. బాధితురాలిని దగ్గరకు తీసుకుని ఏమైందని అడగ్గా..సైగల ద్వారా తనకు జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని రెండు రోజుల్లోనే అరెస్ట్​చేశారు. రాజేంద్రనగర్‌ డీసీపీ ఎస్‌.శ్రీనివాస్, ఏసీపీ టి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో అత్తాపూర్‌ సీఐ కె.నాగేశ్వరరావు,  కానిస్టేబుల్‌ ఎండీ ఇంతియాజ్‌ అహ్మద్, కానిస్టేబుల్‌ కె.వీరేష్‌ నిందితుడిని పట్టుకున్నారు.