దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో కూడిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. పోలీస్ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ జరిగినట్లు తేల్చింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్న విషయాన్ని కూడా పోలీసులు దాచారని సిర్పూర్కర్ కమిషన్ చెప్పింది. పోలీసులు గాయపడి హాస్పిటల్ లో చేరినట్లు కట్టుకథ అల్లారని, సీసీటీవీ ఫుటేజీ దొరకకుండా చేశారని వెల్లడించింది. దిశ నిందితులు ముందుగా కాల్పులు జరిపారంటూ రిపోర్టులో అబద్దాలు రాశారని చెప్పింది. నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని అభిప్రాయపడింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన 10 మంది పోలీసులు సురేందర్, నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్, జానకిరామ్, బాలు రాథోడ్, డి. శ్రీకాంత్‌పై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదుచేయాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సు చేసింది. వీరంతా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, పోలీసు మాన్యువల్ రూల్స్‌ని అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఏవైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని ఆదేశించింది.

2019 నవంబర్‌ 27న శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర నేషనల్ హైవే వద్ద దిశ అనే యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఘటనకు సంబంధించి నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14రోజుల రిమాండ్ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. పోలీసులు కోరడంతో డిసెంబర్ 3న కోర్టు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది. డిసెంబర్‌ 6 తెల్లవారుజామున సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు నలుగురు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారిని కాల్చి చంపారు.

మరిన్ని వార్తల కోసం..

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ