దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే 20వ తేదీ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ (CJI) నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ.. అనంతరం తీసుకొనే చర్యలపై హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయస్థానం పేర్కొంది. దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగిందని, ఇందులో పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపింది. చట్టప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయించడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో వాదనలు వినడం.. సుప్రీంకోర్టు నేరుగా పరిశీలించడం సాధ్యం కాదని చెప్పింది. 

ఇదిలా ఉంటే దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వెల్లడించింది. నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపారని స్పష్టం చేసింది. ఈ మేరకు సిర్పూర్కర్ కమిషన్ 387 పేజీలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను నిందితులను కాల్చి చంపారని అందులో స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. 

అంతకుముందు.. సీల్డ్ కవర్ లోని నివేదిక తమకు అందిందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కమిషన్ నివేదిక బయటకొస్తే సమాజంపై అనేక ప్రభావాలు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. సీనియర్లతో కూడిన కమిటీకి నివేదిక అందజేయాలని పిటిషనర్ కోరడంతో ప్రభుత్వ వైఖరిని 10 నిమిషాల్లో చెప్పాలని కోర్టు ఆదేశించింది.. అనంతరం మళ్లీ జరిగిన విచారణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు... సిర్పూర్కర్ కమిటీ నివేదికను వాద ప్రతివాదులకు ఇవ్వాలని ఆదేశించింది. ఇరుపక్షాలు.. తమ వాదాలను హైకోర్టుకు తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణ హైకోర్టులోనే జరుగుతుందని సీజేఐ జస్టిస్ NV రమణ తెలిపారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై 2020లో రిటైర్డ్ జస్టిస్ సిర్పూర్కర్  నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం : -

బాల్క సుమన్ వేధింపుల వల్లే కాంగ్రెస్ లోకి


చెయ్యి కూడా ఆయుధం అవుతుందన్న సుప్రీం