బాల్క సుమన్ వేధింపుల వల్లే కాంగ్రెస్ లో చేరినం

బాల్క సుమన్ వేధింపుల వల్లే కాంగ్రెస్ లో చేరినం

న్యూఢిల్లీ: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తమని రాజకీయంగా వేధిస్తున్నారని నల్లాల ఓదెలు ఆరోపించారు. 2018లో తనకు టికెట్ ఇవ్వకపోయినా... కేసీఆర్ ఆదేశాల మేరకు సుమన్ గెలుపు కోసం కృషి చేశానన్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్క సుమన్ తమను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న తన భార్య భాగ్యలక్ష్మి విషయంలో ప్రోటో కాల్ పాటించడంలేదని వాపోయారు. తమ ఫ్యోన్లు ట్యాప్ చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్యం చేశారు.  ఈ విషయమై అధిష్టానానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. పార్టీలో తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేస్తున్నారని... తనలాంటి ఉద్యమకారులను పట్టించుకోవడంలేదని వాపోయారు. అందుకే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన నల్లాల ఓదెలు, ఆయన సతీమణి.. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

 

నల్లాల ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గెలిచాకా ప్రభుత్వ విప్ గా పని చేశారు. ఇక ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి ప్రస్తుతం మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యం...

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని నల్లాల ఓదెలు అన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ తో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోందని, ఈ క్రమంలోనే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు పాత్ర పోషిస్తామని నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

ఉత్తర తెలంగాణలో చుక్క నీటికి కష్టాలు

సిద్ధూకు ఏడాది జైలు శిక్ష