ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: భైంసా సబ్​రిజిస్ట్రార్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ సోమవారం రియల్టర్లు, భూముల క్రయవిక్రయదారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్​రిజిస్ట్రార్​మహేందర్ రెడ్డి లేనిపోని కొర్రీలు పెడుతూ ఆరునెలలుగా భూముల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భైంసాలో నిబంధనలు పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో తామంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్, ఖానాపూర్ తదితర ఆఫీసుల్లో లేని నిబంధనలు  భైంసాలో ఎందుకని వారు ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే తప్ప.. పనులు చేయడంలేదన్నారు. అత్యవసర సమయాల్లో ప్లాటు అమ్ముకుందామంటే హైకోర్టు పర్మిషన్​ తీసుకువస్తేనే చేస్తాననడం సరికాదన్నారు. సదరు ఆఫీసర్ పై ఇప్పటికే  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయమై సబ్​రిజిస్ట్రార్​మహేందర్​రెడ్డిని వివరణ కోరగా.. తనకున్న రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరిపై ఎలాంటి కక్షసాధింపులు ఉండవన్నారు. నిరసనలో రియల్టర్లు అరవింద్, జేకే పటేల్, సంతోష్, గాలి రవికుమార్, మామిడొల్ల స్వామి పాల్గొన్నారు.

జాతీయ జెండాను అవమానించడం సరికాదు

నిర్మల్,వెలుగు: జాతీయ జెండాను అగౌరవపరిచిన కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆఫీసులో జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ తో  కలిసి మీడియాతో మాట్లాడారు. ఆదివారం నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలో జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను అగౌరవ పరిచే విధంగా వవహరించారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తే.. కలెక్టర్ మాత్రం సెల్యూట్ చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్​ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి కూడా జెండాకు సెల్యూట్ చేయకుండా అగౌరవ పరిచారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ కుమ్మరి వెంకటేశ్, సోషల్ మీడియా సెల్ కన్వీనర్ నరేశ్ తదితరులు 
పాల్గొన్నారు.

పరిసరాలు క్లీన్​గా ఉంచకపోతే కరెంట్​ ​కట్

ఆసిఫాబాద్,వెలుగు: పరిసరాల్లో చెత్త కనిపించొద్దని, ప్రతీ ఒక్కరూ చెత్త వాహనంలోనే వేయాలని అడిషనల్​ కలెక్టర్​ చాహత్​బాజ్​పేయ్​హెచ్చరించారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని బాపునగర్, రావులవాడ, బజార్ వాడిలో కాలినడక తిరుగుతూ స్థానికులకు అవగాహన కల్పించారు. పట్టణాన్ని క్లీన్​గా ఉంచాల్సిన బాధ్యత అందరిదన్నారు. ప్రజల సహకారం లేకుంటే పరిశుభ్రత సాధ్యంకాదన్నారు. ఇండ్ల  ముందు చెత్త కనిపించినా.. డ్రైనేజీలో వస్తువులు పడేసి ఉన్నా.. ఇంటి యజమానులకు ఫైన్​ వేస్తామన్నారు. అప్పటికీ మారకపోతే విద్యుత్ కనెక్షన్​తొలగిస్తామన్నారు. పట్టణం క్లీన్ గా ఉండాలంటే ప్రజలు సహకరించాలన్నారు. చెత్తను రోడ్లపై వేయొద్దన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వంశీకృష్ణ, రవి, సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం వర్కర్ల ధర్నా

మంచిర్యాల, వెలుగు: ఆరు నెలల నుంచి పెండింగ్​లో ఉన్న మెస్​ చార్జీలు, జీతాలను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజనం వర్కర్లు సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు. కోడిగుడ్లు, కూరగాయలకు పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించాలని, గుడ్లను ప్రభుత్వమే సప్లై చేయాలని, స్టూడెంట్లకు చెల్లిస్తున్న మెస్​ చార్జీలను రూ.15కు పెంచాలని డిమాండ్​ చేశారు. తమకు ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలని, వంటపాత్రలు ఇవ్వాలని, వంటగ్యాస్​ సప్లై చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం వంట కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు న్యాలం శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి నీల పాల్గొన్నారు.  

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జైపూర్,వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జీఎం సూర్యనారాయణరాజును టీబీజీకేఎస్ లీడర్లు కోరారు. కొత్త జీఎంగా బాధ్యతలు స్వీకరించిన సూర్యనారాయణకు టీబీజీకేఎస్​సెంట్రల్, బ్రాంచి కమిటీల ఆధ్వర్యంలో లీడర్లు, ఎంప్లాయీస్​ ఘనస్వాగతం పలికి అనంతరం సమస్యలు తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ నారాయణరావు, రాయమల్లు, టీబీజీకేఎస్​కేంద్ర కమిటీ మెంబర్ రాజు, బ్రాంచి వైస్​ ప్రెసిడెంట్​ సీహెచ్ శ్రీనివాస్, సెక్రటరీ జంగిలి సురేశ్, లీడర్లు రవీంద్రకుమార్, కె.లింగమూర్తి, పరుశురాం, శివ, తరుణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డులో చోటు

మంచిర్యాల, వెలుగు: ఆజాద్ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మంచిర్యాల కార్మెల్​ కాన్వెంట్​ హైస్కూల్​కు చెందిన ఇద్దరు స్టూడెంట్లు రాష్ర్ట గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్​ అందుకున్నారు. టెన్త్​ క్లాస్ చదువుతన్న వేదాంత్ సాయి, ఎనిమిదో తరగతి చదువుతున్న సిద్ధాంత్ సాయి 75 భాతరదేశ చిత్రపటాలను రూపొందించి 75 రకాల విత్తనాలతో వాటిని అలంకరించి అజాదీ కా అమృత్​ మహోత్సవాలపై ప్రచారం చేస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించిన  ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ స్టేట్ చీఫ్  కో ఆర్డినేటర్ ముడపు రాంప్రకాష్, వెన్నంపల్లి రవీందర్ వారికి గవర్నర్​ చేతుల మీదుగా ధృవపత్రం అందజేశారు. మున్ముందు మరెన్నో రికార్డులు సాధించాలని చిన్నారులను గవర్నర్​ ఆశీర్వదించారు.  

అగ్రకుల పెత్తనాన్ని అణగదొక్కాలి

ఆసిఫాబాద్,వెలుగు: అగ్రకుల పెత్తనాన్ని అణగదొక్కాలని... అప్పుడే స్వరాజ్యం సాధ్యమవుతుందని దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్​ చెప్పారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో పాద యాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ లో డీఎస్పీ శిలాఫలకాన్ని ఆవిష్కిరించారు. తరతరాల బానిసత్వం నుంచి విముక్తి కల్పించేందుకు స్వరాజ్య పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేల చెరువులు తవ్వింది బీసీ, ఎస్సీ, ఎస్టీలే కానీ.. ఆ చెరువుల కింద వారికి భూములు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు.. కన్నీళ్లు లేని రాష్ట్రం అవతరించాలన్నారు. అగ్రకులాల ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీల్లో ఒక్కరు మాత్రమే అధ్యక్షుడు ఉంటారని.. కానీ డీఎస్పీలో ప్రతీ ఒక్కరూ అధ్యక్షులేనన్నారు. కార్యక్రమంలో లీడర్లు లక్ష్మణ్, వంశీ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.