HCA యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలె

HCA యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలె

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడాభిమానులపై జరిపిన లాఠీచార్జ్ దారుణమని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది పూర్తిగా హెచ్ సీఏ, ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. టికెట్లు బ్లాక్ లో అమ్మడంతో పాటు ఇంకా అనేక  అక్రమాలు జరిగాయన్న ఆయన... HCA యాజమాన్యంపై, అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దాదాపు ఐదు రోజులుగా ఫ్యాన్స్ టికెట్స్ కోసం జింఖానా, ఉప్పల్ స్టేడియం చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో ఆన్ లైన్ లో అమ్మినా.. ఆ తర్వాత బుక్ చేసుకున్నవాళ్లకు కూడా డబ్బులు వెనక్కి వచ్చాయి. అటు ఆన్ లైన్ లో, ఇటు ఆఫ్ లైన్ లో టికెట్స్ దొరక్కపోవడంతో ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోయింది. నిన్న వేలాదిగా గ్రౌండ్ కు చేరుకోవడం, HCAపై వత్తిడి పెరగడంతో.. ఇవాళ టికెట్స్ ఇస్తామంటూ HCA ఫ్రకటించింది. వేలాదిమంది వస్తారు అని తెలిసినా ఒక్కటే కౌంటర్ పెట్టారు.

అది కూడా టికెట్స్ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, రాత్రి నుంచి లైన్లో ఉన్న ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పించింది. దీంతో అంతా ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.  ఉదయం నుంచే టికెట్స్ అమ్ముతున్నప్పటికీ.. బాగా ఆలస్యం జరుగుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్స్ దొరుకుతాయో లేదోననే టెన్షన్.. కౌంటర్ బంద్ చేస్తారంటూ జరిగిన ప్రచారం, కేవలం 800, 1200 రూపాయల టికెట్స్ మాత్రమే అమ్మడంతో.. అభిమానుల్లో ఆందోళన పెరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి లాఠీ ఛార్జ్ దాకా వెళ్లింది.

జింఖానా గ్రౌండ్  లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన  ఓ  మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో మరో  20మంది గాయపడ్డారు . పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.  గాయపడిన వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.  తొక్కిసలాటలో  ఓ మహిళ చనిపోయినట్లు వస్తోన్న వార్తలపై  అడిషనల్ కమిషనర్ చౌహన్ స్పందించారు.  మహిళ చనిపోలేదని,  యశోదలో చికిత్స పొందుతోందని తెలిపారు.