హైదరాబాద్, వెలుగు: రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించకుండా పోలీస్ బాసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే చలాన్లను విధించేలా జియో ట్యాగ్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఎక్కడ చలాన్ విధించినా పై అధికారులకు తెలిసిపోయేలా పాపప్స్ వచ్చేలా కొత్త సిస్టమ్‌ను తీసుకురాబోతున్నారు. సిటీలోని జంక్షన్లు, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలు, నో పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ సహా కాలనీల రోడ్లను జియో ట్యాగ్ చేయబోతున్నారు. వాటన్నింటినీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు కనెక్ట్ చేయనున్నారు.
చలాన్ల కోసం టార్గెట్లు
ట్రాఫిక్ చలాన్లపై సిబ్బంది టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ అయిపోయిన తర్వాత పూర్తిగా చలాన్లపైనే ఫోకస్ పెడుతున్నారు. డ్యూటీలో ఉన్నంత సేపు కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతోనూ క్యాప్చర్ చేసి జరిమానాలు వేస్తున్నారు. నో పార్కింగ్ బోర్డు లేని చోట కూడా చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేని బస్తీలు, కాలనీల్లో పార్క్ చేసిన వాహనాలకూ నో పార్కింగ్ ఫైన్లు వసూలు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ట్రాఫిక్, పోలీసు బాస్‌లకు ఫిర్యాదులు, సూచనలు చేస్తున్నారు. అకారణంగా ఫైన్లు వేస్తున్నారంటూ వాపోతున్నారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం వదిలేసి చలాన్లను వసూలు చేయడంపైనే దృష్టిపెడ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే చలాన్ల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మా టార్గెట్ చలాన్లు కాదు
చలాన్లు వేయడం, ఫైన్లు వసూలు చేయడం మా టార్గెట్ కాదు. వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చి ప్రమాదాలను నివారించేందుకే మా ప్రయత్నం. ఇకపై మా సిబ్బంది కూడా ఎక్కడపడితే అక్కడ చలాన్లు విధించకుండా కొన్ని మార్పులు చేస్తున్నం. జియో ట్యాగ్ చేసిన చోటే చలాన్లను విధిస్తం.
- ఎ.వి. రంగనాథ్, ట్రాఫిక్ సీపీ, హైదరాబాద్
