
బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ మరోసారి అరెస్టయ్యాడు. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ముంబై పోలీసులు అతడిని నిన్న(శనివారం) అరెస్టు చేశారు. మొదట సమన్లు జారీ చేసిన ఖర్ పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు.
కరోనా వైరస్, తబ్లిగి జమాత్ ప్రస్తావన తీసుకువచ్చి ముస్లింలను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ అజాజ్ ఖాన్‌పై పలుసార్లు కేసులు నమోదైయ్యాయి. గతే డాది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్ కేసులో అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు.
అజాజ్ ఖాన్ హిందీ బిగ్ బాస్ 7వ సీజన్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు బాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్‌లోనూ నటించాడు. దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ సినిమాల్లో నటించాడు.