
‘ఏం తమ్మి నమస్తెనే.. మంచిగున్నవా’అని ఎవరైనా పలకరిస్తే ఠక్కున కోట శ్రీనివాసరావు గుర్తుకొస్తారు. తెలుగు సినిమాల్లో తెలంగాణ మాండలికాన్ని అంతగా పాపులర్ చేసింది ఆయనే.
"తమ్మీ.. నేను మినిస్టర్ కాశయ్యను మాడట్లాడతాండ..", " హైదరబాదుకు రేల్ గాడీలా పోయేటందుకు.. టిక్కెట్ కొనోటెందుకు పైసల్ ఉన్న పతోడు.. పజాసామ్యం గురించి మాట్లాడటోడే.." అంటూ తెలంగాణ యాసలో డైలాగ్‌లు పలికి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించారు. ‘ప్రతిఘటన’చిత్రం మొదలు జయమ్ము నిశ్చయమ్మురా, మనీ,మనీ, గాయం, గణేశ్ లాంటి చిత్రాల్లో ఆయన తెలంగాణ యాసతో మెప్పించారు.
స్వతహాగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇక్కడి యాసలో పర్ఫెక్ట్‌గా డైలాగ్స్ చెప్పేవారు. తనకు ఎంతో ఇష్టమైన మాండలికం తెలంగాణ అని, నటుడిగా తనకు గొప్ప గుర్తింపును తీసుకురావడానికి ఇదే కారణమని, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని కోట శ్రీనివాసరావు పలు సందర్భాల్లో చెప్పారు.
నటనకు నిర్వచనంలా..
‘‘నటన అంటే మాటల్లో కాదు, మాటల మధ్య”అనే ఓ ఫేమస్ కొటేషన్‌కు అసలు సిసలైన అర్థం కోట శ్రీనివాసరావు గారి నటన. తను చెప్పబోయే డైలాగ్‌కు ముందు వచ్చే మౌనం, ఆ తర్వాత ఇచ్చే లుక్, మధ్యలో ఇచ్చే ఫేస్ ఎక్స్‌ప్రేషన్స్ కలిగలిసి ఇది కదా నటనకు పరిపూర్ణ అర్థం అనిపిస్తుంది. ఒక్కోసారి డైలాగ్‌ను మించిన డెప్త్ ఆయన చూపుల్లో కనిపించేది. అందుకే ఆయన డైలాగ్స్ మొదలు, ఎక్స్‌ప్రేషన్స్ వరకూ మీమ్స్ రూపంలో ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి.
ప్రజాదరణ పొందిన కోట డైలాగులు:
ఈ డెవడ్రా బాబూ...
నాకేంటి ..మరి నాకేంటి.
మరదేనమ్మా నా స్పెషల్.
అయ్య నరకాసుర.
అంటే నాన్నా అది
సూపర్ హిట్ కాంబో:
తెలుగు సినీ వినోదానికి మారుపేరుగా నిలిచిన కాంబినేషన్ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్‌లది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. నిజానికి మొదట వీళ్లిద్దరినీ కలిపింది ముత్యల సుబ్బయ్య. ‘మామగారు’మూవీలో వీళ్లిద్దరినీ కలిపి ఒక ట్రాక్ పెట్టారాయన.‘మామగారు’లో వీరి జోడీ చేసిన కామెడీ ఆల్‌టైమ్ హిట్.
సినిమా సక్సెస్ కావడానికి ఆ రెండు పాత్రలూ కూడా కారణం కావడంతో.. అప్పటి నుంచి వీళ్లిద్దరినీ కలిపే కథలు రాసుకునేవారు దర్శకులు. అలా ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. వీరి కాంబోలో వచ్చే సినిమా మినిమమ్ హిట్ అనే ముద్ర ఏర్పడింది. కలిసి నటించడంతో బైట కూడా ఆత్మీయులుగా మారిపోయారు కోట, బాబూ మోహన్.