Actor Madhan Bob: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దిగ్గజ నటుడు కన్నుమూత

Actor Madhan Bob: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దిగ్గజ నటుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దిగ్గజ న‌టుడు, సంగీత గురువు మ‌ద‌న్ బాబ్ (71) కన్నుమూశారు. శనివారం (ఆగస్ట్ 2న) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన మరణించారని తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా మ‌ద‌న్ బాబ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం నాడు తుదిశ్వాస విడిచారు.

మ‌ద‌న్ బాబ్ మృతి పట్ల సినీ పరిశ్రమతో తోపాటుగా ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మధన్ బాబ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తూ సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

త‌న‌దైన హాస్యం, న‌ట‌న‌లో విలక్ష‌ణ శైలితో ఆక‌ట్టుకున్న మ‌ద‌న్ బాబ్ దాదాపు 700 చిత్రాలలో నటించారు. త‌మిళంలో ఎక్కువ సినిమాల్లో న‌టించిన అత‌డు కె బాలచందర్ దర్శకత్వం వహించిన వానమే ఎల్లై (1992)తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోకుండా వరుస సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.

తెనాలి (2000)లో డైమండ్ బాబు.. ఫ్రెండ్స్ (2000)లో మేనేజర్ సుందరేశన్ పాత్ర‌ల్లో సుపరిచితం. తేవర్ మగన్, జాతి మల్లి, నమ్మవర్, సతీ లీలావతి, వసూల్ రాజా, చంద్రముఖి, ఎథిర్ నీచల్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. తెలుగులో భామ‌నే స‌త్య‌భామ‌నే, జెమిని, బంగారం వంటి సినిమాలతో పాటుగా మలయాళంలో భ్రమరం,  సెల్యులాయిడ్ త‌దిత‌ర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.

నటుడు మధన్ బాబ్ కామెడీ మరియు క్యారెక్టర్ పాత్రలలో నటించినప్పటికీ , విలన్‌గా నటించాలనేది అతని చిరకాల కోరిక. కానీ అతని ఆ కోరిక చివరి వరకు నెరవేరలేదు. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చిరునవ్వు శాశ్వతంగా నిలిచిపోతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madan Bob (@iammadanbob)