సోషల్ మీడియాలో ముక్కుసూటిగా మాట్లాడే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమాలే కాదు, సమాజంలో జరిగే పరిణామాలపై కూడా తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంటాడు. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా వేసిన ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీ ఆర్భాటాలు పక్కన పెడితే.. అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతోందంటూ పవన్‌ను నిలదీశాడు రాహుల్.
ఆర్టీఐ యాక్ట్ ఎక్కడ సార్?
పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తోన్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖలను ఉద్దేశించి రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు చేశాడు. @PawanKalyan సార్.. మీ గొప్పలు కాసేపు పక్కన పెడితే, సమాచార హక్కు చట్టం (RTI) సెక్షన్ 4.1(బి) ప్రకారం మీ శాఖల్లోని వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నారా? PESA చట్టం, 1/70 చట్టం, గ్రామసభ చట్టాల అమలు తీరుపై వచ్చిన ఫలితాలను దయచేసి చూపించండి. మీరు చేసినట్లు చెబుతున్న అటవీకరణ (Afforestation) కార్యక్రమాల లెక్కలు ఓ స్వతంత్ర సంస్థ వెల్లడించిన దాని ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసిన ఆర్టీఐ అప్లికేషన్ల ఆధారంగానే ఈ ఫలితాలను అడుగుతున్నా అంటూ నిలదీశాడు.
అంతేకాదు, చివర్లో 'జై తెలంగాణ' అంటూ రాహుల్ పెట్టిన ట్యాగ్ లైన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నించినంత మాత్రాన నేనేం దేశద్రోహిని కాదు' అంటూ పవన్‌కు గట్టి చురకలే అంటించాడు.
మీ అయ్య జాగీరా? కామెంట్స్ ఎఫెక్ట్..
రాహుల్ రామకృష్ణ ఇంతలా రియాక్ట్ అవ్వడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు నెటిజన్లు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ సమాజంలో, మేధావుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను గాయపరిచేలా పవన్ మాట్లాడారంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
బహుశా ఆ కోపంతోనే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ.. పవన్ పర్యవేక్షించే శాఖల్లోని లోపాలను ఎండగడుతూ రాహుల్ రామకృష్ణ ఈ రేంజ్ లో రెచ్చిపోయాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ ఆర్టీఐ అస్త్రానికి జనసేనాని నుండి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి..
@PawanKalyan please ask and show for results for the implementation of PESA, 1/70 Act, Grama Sabha Act. The afforestation programs, did you do them? numbers seem dubious as verified by an independent body
— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026
I’m asking for filed and marked results
Jai Telangana!
