Shivaji: ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. హ్యాకింగ్ టాలెంట్ దేశ భద్రతకు వాడితే సూపర్!

Shivaji: ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. హ్యాకింగ్ టాలెంట్ దేశ భద్రతకు వాడితే సూపర్!

తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన అతి పెద్ద పైరసీ నెట్‌వర్క్ 'ఐ బొమ్మ' (iBomma).  ఎట్టకేలకు దీని వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి  పోలీసులకు చిక్కాడు.  గత కొన్నేళ్లుగా కరేబియన్ దీవులు, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తూ.. పోలీసులకు దొరకకుండా రవి సవాల్ విసిరాడు . దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు  ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రాగానే.. పక్కా సమాచారంతో  అతన్ని కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు.

'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ రవి అరెస్ట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మార్మోగుతోంది. తన వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాల డిజిటల్ ప్రింట్లు, ఓటీటీ కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచడం ద్వారా టాలీవుడ్‌కు రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ సమయంలో అతని అంతర్జాతీయ బ్యాంకు ఖాతాలోని రూ. 3 కోట్లను పోలీసులు స్తంభింపజేశారు.

 హ్యాకింగ్ టాలెంట్ దేశ భద్రతకు ఉపయోగించాలి

అయితే ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారంపై ఓ సినిమా కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ బొమ్మ రవి చేసింది క్షమించరాని నేరమే అయినా, అతనిలో ఉన్న అపారమైన హ్యాకింగ్ సామర్థ్యాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. రవి టాలెంట్ అద్భుతమైనది. అతనికున్న 'క్రిమినల్ బ్రెయిన్'ను మంచి పనికి, ముఖ్యంగా దేశ భద్రతకు ఉపయోగించుకోవాలని సూచించారు.. ఇంతటి తెలివితేటలు, కసిని సరైన మార్గంలో పెట్టి ఉంటే దేశానికి ఉపయోగపడేవాడు. అతను చాలా మంది సినీ ప్రముఖులను ఇబ్బందిపెట్టాడు. కానీ, ప్రతి వ్యక్తికి మార్పు అనేది ముఖ్యం. రవి ఇకనైనా మారాలని కోరుకుంటున్నానని తెలిపారు.

►ALSO READ | Sai Dharam Tej: మెగా మేనల్లుడి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. శ్రీవారి సాక్షిగా ప్రకటించిన సాయి ధరమ్ తేజ్!

ప్రేక్షకులకు ఈ-బొమ్మ ద్వారా లబ్ధి చేకూరినప్పటికీ, సినీ పరిశ్రమ కష్టాన్ని దోచుకోవడం దుర్మార్గమని శివాజీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో అత్యంత చౌకగా లభించేది సినిమా మాత్రమేనని, మంచి సినిమాను ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా, టాలీవుడ్‌ను పీడించిన పైరసీ భూతానికి రవి అరెస్ట్‌తో కొంతవరకు తెర పడినట్టేనని పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి, మిగిలిన సహచరులను కూడా పట్టుకోవాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.