నా కల కూడా నెరవేరింది: సోనూ సూద్‌

నా కల కూడా నెరవేరింది: సోనూ సూద్‌

కరోనా టైమ్‌లో దేశ నలుమూలల్లో ఎవరి ఏ సాయం కావాలన్నా అండగా నిలిచి రియల్ హీరోగా ఎదిగిన సోనూ సూద్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ఒక ఆటో వాలా జీవిత కాల ఆశను తీర్చడానికి ఆయన సిటీలో అడుగుపెట్టారు. వినోద్ అనే వ్యక్తి ఆటోలో కూర్చుని కాసేపు అతడితో ముచ్చటించారు. అతడి ఆటోలో తనను సిటీ అంతా తిప్పి చూపించాలని కోరారు.

తన కల కూడా నెరవేరిందన్న సోనూ సూద్‌

కరోనా టైమ్‌లో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు చూసి హైదరాబాద్‌కు చెందిన వినోద్ అనే ఆటో డ్రైవర్ ఆయనపై ఎనలేని అభిమానం పెంచుకున్నాడు. ఎలాగైనా సోనూ భాయ్‌ను కలవాలని ముంబై కూడా వెళ్లాడు. కానీ సోనూ సూద్‌ను కలవడం కుదరకపోవడంతో నిరాశగా వెనుదిరిగి, వచ్చేశాడు. అయితే సోనూ సూద్‌ను జీవితంలో ఒక్కసారైనా కలవాలన్నదే జీవితాశయం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఆటోపై రాశాడు వినోద్. ‘‘వన్ లైఫ్.. వన్ చాన్స్.. గివ్‌ మీ వన్ చాన్స్‌ టు మీట్‌ యువ్ సోనూ సూద్‌ సర్‌‌” అంటూ తన ఆటోపై రాశాడతను. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోనూ సూద్ వరకూ చేరడంతో ఆయన ఇవాళ హైదరాబాద్ వచ్చి... అతడి కల నెరవేర్చారు. ఈ సందర్భంగా వినోద్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. అతడు తన కల నెరవేరిందని, ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పడంతో.. సోనూ సూద్ తన కల కూడా నెరవేరిందని చెప్పారు. అదెలా అంటే తనకు ఆటో తోలాలని ఎప్పటి నుంచి ఆశగా ఉందని, ఆ కల ఇవాళ్టితో తీరుతోందని అన్నారు. అయితే తనకు ఆటోలో హైదరాబాద్ సిటీ అంతా తిరగాలని ఉందని, తిప్పి చూపిస్తావా అని వినోద్‌ను అడగ్గా, సంతోషంగా సర్ అని అతడు అన్నాడు. అయితే తనకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తావా అని సోనూ సూద్ అడిగితే, అసలు మొత్తం పైసలే వద్దని చెప్పాడు. కానీ సోనూ సూద్ డబల్ అమౌంట్ ఇస్తానని చెప్పారు.