8 వేల మంది విద్యార్థులకు కొత్త జీవితం: డాక్టర్, ఇంజనీర్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

8 వేల మంది విద్యార్థులకు కొత్త జీవితం: డాక్టర్, ఇంజనీర్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

హీరోల ఎదుగుదల కోసం అభిమానులు ఎప్పుడూ పిచ్చిగా ఆలోచిస్తుంటారు. కానీ, ఆరోగ్య వసతులు లేని పేదల కోసం, చదువు దూరమవుతున్న యువత బాగు కోసం ఎంతమంది హీరోలు ఆలోచిస్తుంటారు? ఒక్కసారి ఆలోచించండి. హీరోలు ఒక్కరనే కాదు.. క్రికెటర్లు, పొలిటిషన్లు.. ఇలాంటి వాళ్ళ కోసం అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. కానీ, వీళ్లల్లో జనం కోసం ఎంతమంది నిస్వార్ధంగా సేవ చేస్తారో ఆలోచించండి? చదువు ఒక్కటుంటే చాలు తమ భావితరాల భవిష్యత్తు తామే నిర్మించుకోగలరని నమ్మే వారే.. ‘రియల్ హీరోస్’ అని నమ్మే రోజులు రావాలి. అలాంటి నమ్మకం ఇచ్చిన ఓ రియల్ హీరోనే తమిళ స్టార్ హీరో సూర్య (Suriya).

హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. సామాజిక సేవలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన 15 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. తాను ఉంటున్న ఇల్లునే ఫౌండేషన్గా మార్చి తన సంకల్పానికి తానే తొలి నాందిగా మారిండు. ఇది ప్రతి రంగంలోని అభిమానులు తెలుసుకోవాలి. సూర్య పూనుకున్న సంకల్పానికి గుర్తుగా 1800 మంది ఇంజనీర్లు, 51 మంది డాక్టర్లు తయారయ్యారు. ఇంకొన్ని వేల మంది చదువులో రాణిస్తున్నారు. ఒక్క సూర్య ద్వారానే ఇలాంటి మార్పు వచ్చిందంటే.. అలాంటిది హీరోలందరూ కలిస్తే.. సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలరో గమనించండి. 

అగరం ఫౌండేషన్‌:

సూర్య ‘అగరం ఫౌండేషన్’(Agaram Foundation) అనే ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. 8వేల మందికి పైగా విద్యార్థులకు సూర్య సొంత డబ్బులతో చదువు చెప్పిస్తున్నారు. వారికీ చదువుతో పాటు అన్నీ రకాల వసతులు సైతం కల్పిస్తున్నారు. 

ఇటీవలే (ఆగస్ట్ 3న) ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సూర్య తన కుటుంబంతో పాటుగా సినీ, రాజకీయ మరియు విద్యార్థి బృందాలు హాజరయ్యారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మైలురాళ్ళు దాటుకుని ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులను సూర్య ఘనంగా సత్కరించారు. సూర్య తన మనసులోని మాటలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు కూడా. 

అయితే, ఈ సంస్థ ద్వారా సూర్య సహాయంతో చదువుకుని ఎంతోమంది పలు రంగాల్లో రాణిస్తున్నారు. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, సాఫ్ట్ వేర్స్.. ఇలా ప్రతిరంగంలో ఎదిగిన యువతీయువకులు ఉన్నారు. ఈ క్రమంలో వారందరూ స్టేజీపైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మరికొంతమంది తమ బాధలను, అగరం ఫౌండేషన్‌లో చేరకుముందు పడిన కష్టాలను, ఇప్పుడొచ్చిన మార్పులను చెప్పుకున్నారు.

ఈ క్రమంలో వీరు వివరిస్తున్న మాటలకూ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. వారు పంచుకున్న ప్రతి విషయానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సూర్యకి నెటిజన్లు జేజేలు కొడుతున్నారు. మీరు సార్.. రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.

సక్సెస్ స్టోరీ:

ఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్‌ వల్ల తన జీవితమే మారిపోయిందని ఎమోషనల్ స్పీచ్‌ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్‌లో కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. కానీ, మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా కుటుంబంలో లేదు. అదెందుకో మీకు చెప్తాను. నా లైఫ్ స్టోరీ ఒక సినిమాకథలా అనిపించొచ్చు.

మాదొక మారుమూల పల్లెటూరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం ఉండేది. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఆ ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. అంతేకాకూండా చుట్టాలవలే పాములు కూడా వచ్చేవి. వీటికి తోడు ఆ ఇంటి పెద్ద తాగుడికి బానిస. అతడితో తాగుడు మాన్పించలేక తన భార్య ఎప్పుడు ఏడుస్తూ మౌనంగా ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. ఇలాంటి బాధల్లో సాగింది నా జీవితం. కానీ, నాలో చదువుకోవాలన్న కోరిక మాత్రం ఎప్పుడూ బలంగా ఉండేది. అలానే చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని. కొంతకాలానికి మేమున్న ఆ చిన్న ఇల్లు కూడా కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు కాబట్టి ఏమీ చేయలేకపోయారు.

ఇలాంటి క్రమంలోనే ఇంటర్ కంప్లీట్ చేసి కాలేజీ టాపర్‌గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్‌ అగరం ఫౌండేషన్‌ నెంబర్‌ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్‌కు కాల్‌ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది. ఈ సంస్థ నుంచి మంచి కాలేజీలో చేరి కెరీర్‌ గైడెన్స్‌ పొందగలిగాను. ఈ క్రమంలో ఉన్నతంగా చదువుకుని అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ సాధించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాను.

ఆ తర్వాత TCSలో ఉద్యోగం పొందాను. కొంతకాలానికి ఇంకా మంచి ప్యాకేజీతో ఇన్ఫోసిస్‌కు మారాను. ఇప్పుడు నాకు రెండు పెద్ద ఇళ్ళు ఉన్నాయి. అదంతా నేను చదువుకొవడానికి, గైడెన్స్ తో పాటు అన్నిరకాల సౌకర్యాలు కల్పించిన అగరం ఫౌండేషన్‌ వల్లే సాధ్యమైందని జయప్రియ తన కథను చెప్పుకొచ్చింది. 

నిజానికి హీరో సూర్యలా ఎవరుంటారు చెప్పండి.. సాధించిన విజయంలో సగం వాటా సమాజానికి ఇచ్చేవాళ్ళు. వచ్చే డబ్బులతో మరో సినిమా తీయాలి.. ఇంత ఖర్చు పెడితే.. ఇన్ని కోట్ల వసూళ్లు వచ్చాయని చెప్పుకోవడంతోనే సరిపోతుంది. కానీ, సూర్య అలా కాడు . గెలుపోటములు ఏ మాత్రం లెక్క చేయడు. కేవలం సామాజిక కోణంలోనే తన జీవితాన్ని సాగిస్తాడు.  ఇలాంటి సూర్యని ఇష్టపడని వారెవరైనా ఉంటారా.. అందుకే సూర్య ఎప్పటికీ గోల్డెన్ హార్ట్!