
బుల్లితెర నటి తునీషా శర్మ మృతి కేసులో నిందితుడిగా ఉన్న షీజన్ ఖాన్ కుటుంబ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. షీజన్ ఖాన్ పై తునీషా తల్లి తప్పుడు ఆరోపణలు చేసి ఇరికించారని ఆరోపించారు. తాము తునీషాను ఓ కుటుంబసభ్యురాలిగా భావించేవాళ్లమని షీజన్ ఖాన్ సోదరీమణులు తెలిపారు. ఆమె తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునేదని, కానీ ఆమె తల్లి మాత్రం తునీషాకు ఎప్పుడూ ఏదో ఒక పని చేయాలంటూ బలవంతం చేసేదని చెప్పారు.
తమ ఇంటికి తునీషా చాలా సార్లు వస్తుండేదని, చాలా సన్నిహితంగా ఉండేదని షీజన్ ఖాన్ సోదరి ఫలాక్ నాజ్ తెలిపారు. షూటింగ్ సమయంలో తునీషాను షీజన్ చెప్పుతో కొట్టాడన్నది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తమపై చేస్తున్న ఆరోపణలకు తునీషా తల్లి ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. తునీషాను హిజాబ్ ధరించాలని బలవంతం చేశామన్న ఆరోపణల్లో నిజం లేదని, తాము ఆమెను ఎప్పుడూ అలా చేయమని అడగలేదని స్పష్టం చేశారు. జనవరి 4న తునీషా పుట్టినరోజని, ఆ రోజున తనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని కూడా అనుకున్నామని నాజ్ అన్నారు. ఆమె తన చెల్లెలు లాంటిదన్న నాజ్.. ఏదేమైనా తునీషాకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. షీజన్ ను తునీషా తల్లి తప్పుడు కేసు పెట్టి ఇరికించాలని చూస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.