మల్టీ టాలెంట్​తో మస్త్​ క్రేజ్​

మల్టీ టాలెంట్​తో  మస్త్​ క్రేజ్​

భరత నాట్యం, కథక్​ డాన్స్​ చేస్తుంది. మార్షల్ ఆర్ట్స్​లో బ్లాక్​ బెల్ట్ ఉంది. అందాల పోటీల్లో చాలా సార్లు కిరీటం అందుకున్న టాలెంటెడ్ గర్ల్​. ఇన్ని స్కిల్స్ ఉన్న ఈమె ఎవరు అనుకుంటున్నారా?పేరు  దీప్తి సేథి. అమ్మానాన్నలు చెప్పిన ఫీల్డ్​లో కాకుండా తనకు నచ్చిన సినిమా రంగంలో అడుగుపెట్టింది. మలయాళంలో చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడామెకు ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. పుట్టిల్లు ముంబై అయినా, ప్రస్తుతం మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాదిలో క్రేజ్​ సంపాదించుకుంది. ఆమె జర్నీ ఎలా సాగిందో తన మాటల్లోనే... 

నేను పుట్టి, పెరిగింది ముంబైలో. అమ్మ మాధురి, నాన్న దివ్యేశ్​ సేథి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు తోబుట్టువులు ఎవరూ లేరు. చిన్నప్పుడు కనొస్సా కాన్వెంట్ హై స్కూల్లో చదివా. సెయింట్ జేవియర్స్ కాలేజీలో బ్యాచిలర్​ ఆఫ్ బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​ ఎడ్యుకేషన్​ చేశా. ఆ తర్వాత మోడలింగ్​లోకి అడుగుపెట్టా. మొదటిసారి ‘పాంటలూన్స్ ఫ్రెష్​ ఫేస్​ హంట్’​ కాంపిటీషన్​లో పార్టిసిపేట్​ చేశా. ఆ తర్వాత 2011లో ‘మిస్​ కేరళ’గా ఎన్నికయ్యా. ఆ మరుసటి ఏడాది ‘నవీ క్వీన్’ టైటిల్ గెలుచుకున్నా. అలాగే ‘ఇండియన్ ప్రిన్సెస్ ఇంటర్నేషనల్’ పోటీలో మొదటి రన్నరప్​గా నిలిచా. ‘మిస్ టాలెంటెడ్, మిస్ ఐరన్ మెయిడెన్ 2014’  టైటిల్స్​తో గెలిచా. అప్పటి నుంచి అడ్వర్టైజ్​మెంట్​లతో బిజీ అయిపోయా. అక్కడ సక్సెస్​ అయ్యాక మలయాళం ఇండస్ట్రీలోకి 2015లో ‘నీ–నా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చా. 

ఇవన్నీ నా ఇంట్రెస్ట్​లే...

నేను మూడేండ్ల వయసునుంచే భరతనాట్యం, కథక్​ డాన్స్​లు నేర్చుకోవడం మొదలుపెట్టా. ఏదో ఒక రోజు నా డాన్సింగ్​ స్కిల్స్ నాకు ఉపయోగపడతాయని అనుకుంటుండేదాన్ని. ప్యాండెమిక్​లో నా ఫ్రెండ్​ నీరవ్​ డాన్స్ రీల్స్ చేసేవాడు. ఒకసారి నన్ను కూడా తనతో కలిసి డాన్స్ రీల్స్​  చేయమని అడిగాడు. నేను వెంటనే సరే అన్నాను. తనతో కలిసి ఫ్రీ స్టయిల్ కాంటెంపొరరీ డాన్స్ స్టయిల్స్ ట్రై చేశా. అవి శరీరానికి, మనసుకు వామప్​లా ఉండేవి. ఆ తర్వాత సోలోగా క్లాసికల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నా. అయితే ‘పులి’ సినిమాలో నా క్లాసికల్ డాన్స్ పనికొచ్చింది. అది పీరియాడిక్ సినిమా కావడంతో నాకు ఆ అవకాశం దక్కింది. అందులో నా పాత్రపేరు సావిత్రి. నన్ను ట్రెడిషనల్ లుక్​లో చూసి ఆడియెన్స్ థ్రిల్​ ఫీలయ్యారు.  

ప్యాండెమిక్​ వచ్చినప్పుడు నేను ముంబైలో ఉండిపోయా. ఆరు నెలలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశా. ఇంట్లో వండిన ఫుడ్​ని ఎంజాయ్ చేశా. వర్కవుట్స్ చేశా. ఒక రకంగా చెప్పాలంటే నా గురించి నేను కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నా. షూటింగ్​ల బిజీ నుంచి కాస్త రిలాక్స్ అయ్యే టైం దొరికింది. దాంతో ఆన్​లైన్​ ట్రైనర్స్ ద్వారా జిమ్నాస్టిక్స్, యోగా నేర్చుకోవడం కూడా మొదలుపెట్టా. ఇలా ఏదో ఒకటి నేర్చుకునే అలవాటు చిన్నప్పటి నుంచీ ఉంది. అందుకే డాన్స్ నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకు నేర్చుకున్నా. కరాటేలో నాకు బ్లాక్​ బెల్ట్​ ఉంది. అది నా యాక్షన్ ఫిల్మ్స్​కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. 

భాష అర్థమయ్యేది కాదు

నేను మిస్ కేరళ టైటిల్ గెలిచాక, డైరెక్టర్ లాల్​ జోస్ టీమ్​ నుంచి నాకు ఫోన్​ కాల్ వచ్చింది. వాళ్లు అప్పటికే టైటిల్ రోల్ కోసం కొత్త నటిని వెతుకుతున్నారు. వాళ్లు నన్ను గుర్తించి, స్క్రీన్​ టెస్ట్​కి రమ్మని పిలిచారు. అది అయిన మూడు రోజుల తరువాత ఫోన్ చేసి ‘సెలక్టెడ్’ అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే ఆ ఆడిషన్స్​కి ఐదు వందల మంది వచ్చారు. అందులో నన్ను సెలక్ట్​ చేయడం నాకు మర్చిపోలేని జ్ఞాపకం. అలా నేను మొదటిసారి మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చా. రావడానికయితే వచ్చా కానీ.. నాకు భాష రాదు. మా అమ్మ కొచ్చికి చెందినామె. మా ఇంట్లో ఆమె మాత్రమే మాట్లాడుతుంది. మాకు రాకపోవడంతో భాష అర్థంకాకపోయినా కష్టంగా భరించాల్సి వచ్చేది. ఒక్కోసారి ఆమె మాట్లాడేది నేను అర్థం చేసుకోలేకపోతున్నా అని ఫీల్ అయ్యేది అమ్మ. ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు భాష బాగా వచ్చు. మలయాళంలో ఎనిమిది సినిమాలు చేశాక, నాకు భాష మీద పట్టు వచ్చింది. ఇన్ని సినిమాలు, ఆ క్యారెక్టర్లు చేయడం, కొన్నేండ్లపాటు అక్కడే ఉండడంతో కేరళతో మంచి కనెక్షన్ ఏర్పడింది. అక్కడ ఉన్న టాలెంటెడ్​, హార్డ్ వర్కింగ్​ క్రియేటర్స్​తో నేను కలిసి పనిచేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. 

ఫిట్​నెస్​ గురించి..

నాకు డెజర్ట్​ అంటే చాలా ఇష్టం. భోజనం కూడా మంచిగా తింటా. కాకపోతే క్యాలరీలు పెరగకుండా ఎక్సర్​సైజ్ చేస్తా. నా ట్రైనర్స్ కూడా నా స్టామినా గురించి గొప్పగా చెప్తారు. ప్రతిరోజు గంట లేదా గంటన్నర వర్కవుట్స్ చేస్తా. ఫిట్​గా ఉండడం అనేది లైఫ్ స్టైల్ ఛాయిస్. అయితే, అన్నిరోజులు ఒకేలా ఉంటాయి అనుకోకూడదు. కొన్ని రోజులు బాగుంటాయి. మరికొన్ని బాగుండవు అనేది అర్థం చేసుకోవాలి. యాక్టర్స్ మాత్రమే కాదు.. ఎవరైనా సరే శారీరకంగా, మానసికంగా ఫిట్​గా ఉండాలి.  
ఆఖరి నిమిషంలో వచ్చిన అవకాశం

నిజానికి నేను సోలో సినిమాలో నటిస్తానని ఊహించలేదు. అసలు ఆ అవకాశమెలా వచ్చిందంటే.. నా ఫొటోని మ్యాగజీన్​ కవర్​ మీద చూసి, వెంటనే టీమ్​కి చెప్పి నన్ను కాంటాక్ట్​ అయ్యారు డైరెక్టర్ బెజోయ్. వాళ్లు ఫోన్​ చేసి ఆఫర్​ ఇచ్చారు. ఏం ఆలోచించకుండా వెంటనే ‘సరే’ అన్నా. అందులో దుల్కర్​ సల్మాన్​ ఫ్రెండ్​ క్యారెక్టర్​ చేశా. 

అమ్మ వల్ల...

మా అమ్మ మలయాళీ. నాన్న పహాడి. నేనేమో ముంబైకర్​. మా ఫ్యామిలీకి ఫిల్మ్స్​కి కనెక్షనే లేదు. కానీ, చిన్నప్పటి నుంచి అద్దం చూసుకుంటూ రెడీ అవ్వడమంటే చాలా ఇష్టం నాకు. చిన్నవయసులోనే అద్దం ముందు నిల్చొని యాక్టింగ్ చేస్తుండేదాన్ని. అది చూసి మా నాన్న ‘చదువు మీద శ్రద్ధ పెట్టు’ అనేవాడు. కానీ, అమ్మ మాత్రం ఎంకరేజ్ చేసేది. ఆమె వల్లే నేను భరతనాట్యం, కథక్​ డాన్స్​లు నేర్చుకున్నా. అప్పటి నుంచి స్కూల్లో, కాలేజీలో రెగ్యులర్​గా డాన్స్​ కాంపిటీషన్స్​లో పాల్గొనేదాన్ని. నేను కాలేజీలో చదివేటప్పుడు ఒక గోల్ పెట్టుకున్నా. అదే.. మిస్​ ఇండియా ఈవెంట్​లో పాల్గొనాలని. కాకపోతే అందుకోసం కొంత ఎక్స్​పీరియెన్స్ కావాలి అనుకున్నా. అప్పటికి నాకు మలయాళం రాకపోయినా కేరళ అందాల పోటీల్లో పార్టిసిపేట్​ చేశా. అందులో టైటిల్​గెలుచుకున్నా. ఆ తర్వాత మిస్​ ఇండియా పోటీల్లో పాల్గొనడం కోసం ట్రై చేశా. దానికోసం టైమ్స్ గ్రూప్​తో కాంట్రాక్ట్​లో భాగమై, ప్రచారం చేశా. ఆ టైంలోనే లాల్​ జోస్​ నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. మొదట్లో మా అమ్మానాన్నలకి నేను యాక్టర్​ అవ్వడం ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ ఇంజనీరింగ్ చేయమంటే, నాన్న మెడికల్ చేయమనేవాళ్లు. కానీ, నా మనసు ఈ రెండింటికీ భిన్నంగా ఉండేది. కళల పట్ల నా డెడికేషన్ చూశాక వాళ్లు నాకు సపోర్ట్​ చేయడమే కాదు.. ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. షూటింగ్స్​కి వెళ్లేటప్పుడు మా అమ్మ నాతో వస్తుంది. 

నీనా తర్వాత

నీనా తర్వాత మలయాళంతోపాటు తమిళం, తెలుగులో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, అవన్నీ మొదటి సినిమాలోని క్యారెక్టర్​లానే ఉండడంతో చేయలేదు. ఒకేలాంటి పాత్రల్లో నటించడం ఇష్టం లేదు నాకు. వేరువేరు పాత్రల్లో నటిస్తేనే నా పర్ఫార్మెన్స్​ తెలుస్తుంది. నేను అలా ఆలోచిస్తున్న టైంలో ‘జాగ్వార్’లో లీడ్ హీరోయిన్ కోసం కొత్త నటులకు ఆడిషన్​ జరుగుతుందని తెలిసింది. ఆడిషన్స్​ ఇంకో ఐదు రోజుల పాటు చేస్తారనగా నేను ఆడిషన్​కి వెళ్లా. అప్పటికి నేనే లాస్ట్​ పర్సన్​ని. లక్కీగా నాకు అవకాశం వచ్చింది.                     ::: ప్రజ్ఞ