
ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించి, ఆ తర్వాత టెక్నీషియన్‌గా వివిధ విభాగాల్లో పని చేసిన గౌతమి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తున్నారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధానపాత్రల్లో నందినీరెడ్డి తీసిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా గౌతమి మాట్లాడుతూ ‘ఇందులో ‘మీనాక్షి’ అనే పాత్ర పోషించా. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా ఉండాలనుకుంటారో అలాంటి పాత్ర. కుటుంబాన్ని అద్బుతంగా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. నా కెరీర్ ప్రారంభంలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కి జంటగా మళ్లీ నటించడం సంతోషంగా ఉంది. ఓ మహిళ దర్శకురాలు, మహిళా నిర్మాత కలిసి ప్రేక్షకులకు అందిస్తున్న మర్చిపోలేని బహుమతి ఇది.
నిజానికి నేనెప్పుడూ జెండర్‌ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో నందిని, స్వప్న వండర్ ఫుల్ పర్సన్స్. ఇక ప్రస్తుతం రామ్, బోయపాటి సినిమాలో నటిస్తున్నా. ఓ వెబ్ సిరీస్ పూర్తయింది. మరో వెబ్ సిరీస్ చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సినిమా అనేది నా ఫస్ట్ లవ్. నటిగా మాత్రమే కాదు.. సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో పనిచేశా. ఇప్పటికీ అదే ఎక్సయిట్‌మెంట్‌తో వర్క్ చేస్తున్నా. ఇక మా అమ్మాయి సుబ్బలక్ష్మి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. ప్రస్తుతానికైతే తనకు కెమెరా వెనుక ఉండటం ఇష్టం. భవిష్యత్తులో తన ఇష్టాన్ని బట్టి ముందుకెళ్తుంది’ అన్నారు.