Meena : 'నేనొక ఒంటరి మహిళననే కదా మీ చులకన'.. రెండో పెళ్లి వార్తలపై నటి మీనా ఫైర్!

Meena : 'నేనొక ఒంటరి మహిళననే కదా మీ చులకన'.. రెండో పెళ్లి వార్తలపై నటి మీనా ఫైర్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా.  బాలనటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పింది.  సినీ ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉన్న ఆమె సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది.  ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నేనొక ఒంటరి మహిళననే కదా..

గత రెండేళ్లుగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఏదో ఒక హీరో పేరును ఆమెకు ముడిపెడుతూ, పెళ్లి ముహూర్తం కూడా ఖరారైందంటూ కథనాలు రాస్తున్నారు. వీటిపై మీనా క్లారిటీ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న అసత్య ప్రచారాలపై కన్నెర్ర జేశారు. ముఖ్యంగా భర్త విద్యాసాగర్ మరణం తర్వాత ఆమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మీనా ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

నా రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని మీనా స్పష్టం చేశారు.. అసలు సంబంధం లేని వ్యక్తులతో నాకు లింకులు పెడుతున్నారు. నేనొక సెలబ్రిటీని, పైగా ఒంటరి మహిళను కావడమే మీకు చులకనైపోయిందా? నా సహనాన్ని పరీక్షించకండి అంటూ ఆమె హెచ్చరించారు. ఇలాం ఆసత్యా కథనాలు ఎలా పుట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు..

మీనా భర్త విద్యాసాగర్ 2022లో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో మరణించారు. అప్పటి నుండి మీనా తన 15 ఏళ్ల కుమార్తె నైనిక బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ పుకార్లు తన కూతురిపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎదిగొచ్చిన కూతురు ఉంది. ఇలాంటి చెత్త రాతలు తను చూస్తే ఏమనుకుంటుంది? ఇది నాకు ఎంతో అసౌకర్యంగా, చిరాకుగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని అంగడిలో పెడుతున్నారంటూ మీనా సీరియస్ అయ్యారు . కర్మ అనేది ఒకటి ఉంది, అది ఎవరినీ వదిలిపెట్టదు. ఇలాంటి నెగెటివిటీపై స్పందించి నా ఆరోగ్యాన్ని, సమయాన్ని వృధా చేసుకోను. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. నా ఫోకస్ అంతా నా కూతురు, నా పనిపైనే ఉంటుంది అని స్పష్టం చేశారు.

సెకండ్ ఇన్నింగ్ లో.. 

మీనా కేవలం ఒక నటి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించారు. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, మోహన్ లాల్ వంటి లెజెండ్స్ సరసన బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. రెండు ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, తమిళనాడు స్టేట్ అవార్డులతో పాటు గౌరవనీయమైన 'కలైమామణి' పురస్కారాన్ని అందుకున్నారు. నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్ గా, ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ,  టీవీ జడ్జిగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో 'రోస్లిన్' వెబ్ సిరీస్ తో పాటు మలయాళంలో' దృశ్యం3'లో నటిస్తున్నారు.