హోం గార్డుపై దాడి చేయడం తప్పే.. నటి సౌమ్య జాను

హోం గార్డుపై దాడి చేయడం తప్పే.. నటి సౌమ్య జాను

జూబ్లీహిల్స్, వెలుగు: ట్రాఫిక్​ హోంగార్డ్​ విఘ్నేశ్ పై దాడి కేసులో బంజారాహిల్స్​ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం నటి సౌమ్య జాను​ను​అదుపులోకి తీసుకుని విచారించారు. ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగింది. అనంతరం  41ఏ  సీఆర్​పీసీ నోటీస్ ​ఇచ్చి పంపిచేశారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆమెను ఆదేశించారు. పోలీస్​స్టేషన్​ నుంచి బయటికి వచ్చిన సౌమ్య జానును విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ‘నేను తప్పు చేశానని ఒప్పకున్నా. అయితే ఎవరిపైనా దాడి చేయలేదు. దయచేసి దాడి అనొద్దు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చా. ఆ కారు నాది కాదు. వార్తల్లో జాగ్వార్​ కారు అని రాస్తున్నారు. అది మా ఫ్రెండ్​ది. త్వరలోనే అన్ని విషయాలు మీడియాతో చెబుతా’ అని చెప్పి వెళ్లిపోయింది. 

గత నెల 24న నటి షేక్​జాన్​బీ అలియాస్ ​సౌమ్యజాను ​బంజారాహిల్స్​రోడ్ ​నంబరు 12లోని అగ్రసేన్​ సర్కిల్​వద్ద రాంగ్​రూటులో కారు డ్రైవ్​చేసింది. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్​ హోంగార్డ్​విఘ్నేశ్ ​కారును ఆపాడు. రాంగ్​ రూటులో ఎందుకొస్తున్నారంటూ ప్రశ్నించాడు. నన్నే ఆపుతావా అంటూ సౌమ్య వాగ్వాదానికి దిగింది. విఘ్నేశ్​షర్టు పట్టుకుని లాగడంతో షర్టు చినిగింది. సెల్​ఫోన్​పగిలిపోయింది. విఘ్నేశ్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు అరెస్ట్​ చేస్తారన్న భయంతో సౌమ్య జాను దుబాయ్​ వెళ్లి పోయింది. తిరిగి వచ్చే లోపు ఆమె తరపు లాయర్​పుట్టి శివశంకర్ హైకోర్టులో క్వాష్​ ఫిటిషన్​ వేశారు.  మార్చి 11లోపు పోలీసులు పిలిస్తే విచారణకు హాజరు కావాలని నటి సౌమ్య జాను​కు ఈ నెల 4న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో బుధవారం ఆమె విచారణకు హాజరయ్యారు.