ఖమ్మం ట్రాన్స్ కో, భువనగిరి ఏవో ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

ఖమ్మం ట్రాన్స్ కో, భువనగిరి ఏవో ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాకేంద్రంలోని బూడిదెంపాడు ట్రాన్స్ కో అసిస్టెంట్ సబ్ డివిజన్ ఇంజనీర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్న ఏడీ గుగులోతు వీర్య, ఏఈ రనిల్ ఏసీబీకి చిక్కారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సురేశ్ బాబు అనే కాంట్రాక్టర్ 2021లో రూ.5లక్షల విలువైన లైన్ టవర్స్ కు సంబంధించిన పనులు చేశాడు. పనులు ప్రారంభించకముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.లక్ష చెల్లించాడు. పనులు పూర్తయ్యాక సెక్యూరిటీ డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఏడీ వీర్య, ఏఈ రనిల్ రూ.20వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ జి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వర్క్స్ కు సంబంధించిన ఎంబీని సీజ్ చేశారు. దీనిపై ఎస్ఈ దీపక్ వాస్నిక్ మాట్లాడుతూ.. ఏసీబీకి చిక్కిన ఏడీ, ఏఈలపై శాఖాపరమైన చర్యలుంటాయన్నారు. కాంట్రాక్టర్ సురేశ్ బాబు..  బ్లాక్ లిస్టులో ఉన్నాడని తెలిపారు.

ఏసీబీకి పట్టుబడ్డ భువనగిరి ఏవో..
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం రోజుల్లోనే మరో ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. ఫర్టిలైజర్​షాప్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వారి నుంచి లంచం డిమాండ్​చేసిన అగ్రికల్చర్ ఏవోను ఏసీబీ హ్యాండెడ్​గా పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన వేముల విజయ్, రాజు.. భువనగిరి మండలం అనాజీపురంలో ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ కోసం ఈ ఏడాది జూలై 19న ఏవో వెంకటేశ్వర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనాజీపురంలో ఇప్పటికే ఎరువుల దుకాణం ఉందని.. మరో షాప్​కు లైసెన్స్ ఇష్యూ చేయాలంటే తనకు రూ.2 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.లక్షకు బేరం కుదిర్చాడు. దీంతో సదరు వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం భువనగిరి అగ్రికల్చర్ ఆఫీస్ లో గురువారం వ్యాపారుల నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.