
- షార్ప్, పానాసోనిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం
న్యూఢిల్లీ: ఇండియాలో ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అదానీ గ్రూప్ జపాన్ కంపెనీలు షార్ప్, పానాసోనిక్‌లతో చర్చలు జరుపుతోంది. ఇది సెమి కండక్టర్ రంగంలోకి అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ చేసిన రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంగా, ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్స్‌తో కలిసి మహారాష్ట్రలో చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చూసింది. ఈ ప్రాజెక్ట్ వాణిజ్య పరంగా అనుకూలం కాదనే కారణంతో ఆగిపోయింది. తాజాగా మోదీ జపాన్ పర్యాటన తర్వాత అదానీ గ్రూప్‌కు, షార్ప్, పానాసోనిక్ మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటుకు అవసరమైన పవర్, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో అదానీ సాయపడుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం భూమిని ఇచ్చేందుకు 'కంఫర్ట్ లెటర్' ఇచ్చింది. ఈ భూమిని సెమికండక్టర్ ప్రాజెక్ట్‌లకు కూడా కంపెనీ ఉపయోగించొచ్చు.
సెమికాన్ 2.0తో సబ్సిడీ
సెమికాన్ 1.0 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. సెమికాన్ 2.0 ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా డిస్‌ప్లే ఫ్యాబ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశీయ తయారీ పెంచడం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే వేదాంత, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వంటి సంస్థలు ప్రతిపాదనలు ఇచ్చినా, ఇంకా సబ్సిడీ ఆమోదం రాలేదు. ఇండియా ప్రపంచ డిస్‌ప్లే మార్కెట్‌లో 9శాతం వినియోగం కలిగి ఉంది. కానీ, డిస్‌ప్లే అసెంబ్లీ విలువలో 8–12 శాతం మాత్రమే ఇక్కడ జరుగుతోంది. ఫ్యాబ్‌ల ద్వారా 70శాతం విలువను దేశంలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. షార్ప్‌కు ఐజీజెడ్‌ఓ టెక్నాలజీ, నానో ఎల్‌ఈడీ, రిఫ్లెక్టివ్ డిస్‌ప్లేల్లో నైపుణ్యం ఉండగా, పానాసోనిక్ ఆటోమోటివ్ డిస్‌ప్లే రంగంలో కీలకంగా ఉంది.