అన్నింటికీ అప్పులపైనే.....

అన్నింటికీ అప్పులపైనే.....
  • అదానీ గ్రూప్​...అప్పుల కుప్ప!
  • హెచ్చరించిన క్రెడిట్ ​ సైట్స్​

వ్యాపారాల విస్తరణకు, కొత్త రంగాలలో అడుగు పెట్టేందుకూ అప్పులపైనే ఆధారపడటంతో అదానీ గ్రూప్​ అప్పుల కుప్పగా మారిందని క్రెడిట్​ రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్​ అనుబంధ సంస్థ క్రెడిట్​సైట్స్​ వెల్లడించింది. అప్పుల విషయంలో ఈ గ్రూప్​ చాలా ఎక్కువ లివరేజ్​ తీసుకున్నట్లు పేర్కొంది. ఈ గ్రూప్​ ప్రమోటర్​ గౌతమ్​ అదానీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్నుడుగా మారారు. పోర్టులు, విద్యుత్​, సిమెంట్​ వంటి రంగాలలో అదానీ గ్రూప్​ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రోత్​ ప్లాన్స్​ కోసం డబ్బును ఈ గ్రూప్​  చాలా ఎక్కువగా అప్పుల రూపంలోనే సమకూర్చుకుంటోంది. దీంతో భవిష్యత్​లో ఈ గ్రూప్​ అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం పొంచి ఉందని క్రెడిట్​సైట్స్​తన రిపోర్టులో  హెచ్చరించింది. ​ ఒత్తిడి అధికమైతే గ్రూప్​లోని ఏదో ఒకటి లేదా ఎక్కువ  కంపెనీలు డిఫాల్టర్స్​గా మారే ఛాన్స్​ ఉందని పేర్కొంది.

1980వ దశకంలో కమోడిటీస్ ట్రేడింగ్​తో మొదలైన అదానీ గ్రూప్ ఆ తర్వాత మైన్స్, పోర్టులు, పవర్​ ప్లాంట్స్, ఎయిర్​పోర్ట్స్, డేటా సెంటర్స్, డిఫెన్స్ రంగాలలోకి విస్తరించింది. హోల్సిమ్​ బిజినెస్​ను 10.5 బిలియన్​ డాలర్లకు​ కొనడం ద్వారా ఇటీవలే సిమెంట్​ రంగంలోకీ అదానీ గ్రూప్​ అడుగు పెట్టింది. తాజాగా అల్యూమినియా మాన్యుఫాక్చరింగ్​నూ మొదలెట్టింది. గత కొన్నేళ్లలో విస్తరణ కోసం అదానీ గ్రూప్​ చాలా దూకుడు చూపిస్తోంది. ఫలితంగా క్రెడిట్​ మెట్రిక్స్, క్యాష్​ ఫ్లోలపై ఎఫెక్ట్​ పడుతోందని క్రెడిట్​సైట్స్​ తెలిపింది. తనకు పరిచయం లేని లేదా సంబంధం లేని రంగాలలోకీ అదానీ గ్రూప్​ ఎంటరవుతోందని, ఈ బిజినెస్​లు అన్నీ డబ్బు చాలా ఎక్కువ మొత్తంలో అవసరమైనవే కావడం గమనించదగ్గ అంశమని పేర్కొంది. కొత్త బిజినెస్​ల ఎగ్జిక్యూషన్​లో ఏవైనా ఇబ్బందులొస్తే సమస్యగా మారే ఛాన్స్​ ఉంటుందని అభిప్రాయపడింది.

గ్రూప్​ కంపెనీలలోకి అదానీలు సొంత డబ్బునూ ఈక్విటీగా పెడుతున్నారు. కాకపోతే, ఎన్విరాన్​మెంటల్, సోషల్, గవర్నెన్స్​ (సీఎస్​జీ) రిస్కుల రూపంలో కొంత ప్రమాదం లేకపోలేదని క్రెడిట్​సైట్స్​ ఈ రిపోర్టులో తెలిపింది. అదానీ ఎంటర్​ప్రైజస్​ కింద ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అసెట్స్​ను, కంపెనీలను అదానీ గ్రూప్​ నిర్వహిస్తోంది. సక్సెస్​ఫుల్​గా నడపడంలోనూ గ్రూప్​ పేరు సంపాదించుకుంది. దేశపు ఎకానమీ ముందడుగు వేయడంలోనూ ఈ గ్రూప్​ తన వంతు బాధ్యతను నెరవేరుస్తోందని క్రెడిట్​సైట్స్​ రిపోర్టు ప్రస్తావించింది. అదానీ గ్రూప్​లోని ఆరు కంపెనీలు స్టాక్​ ఎక్స్చేంజీలలో లిస్టయ్యాయి. గ్రూప్​లోని కొన్ని కంపెనీలు డాలర్​ బాండ్స్​అప్పులను తీర్చాల్సి ఉంది. ఈ ఆరు లిస్టెడ్​ కంపెనీలకూ కలిపి 2022 ఫైనాన్షియల్​ ఇయర్​ చివరినాటికి  రూ.2,309 బిలియన్​ల అప్పులు ఉన్నాయి. చేతిలోని క్యాష్​ను మినహాయించి లెక్కిస్తే నికర అప్పులు రూ.1,729 బిలియన్​లు. 

అన్నింటికీ అప్పులపైనే.....

తాను ఇప్పటికే ఉన్న వ్యాపారాలలో పెట్టుబడులతోపాటు, కొత్త రంగాలలోకి అడుగు పెట్టడానికీ అదానీ గ్రూప్​ డబ్బును ప్రధానంగా అప్పుల రూపంలోనే సమీకరిస్తోందని చెబుతూ, సరిగ్గా ఇదే సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని క్రెడిట్​సైట్స్​ వ్యాఖ్యానించింది. రిలయన్స్​ ఇండస్ట్రీస్​,  టాటా గ్రూప్​ల తర్వాత దేశంలోని అతి పెద్ద కార్పొరేట్​ గ్రూప్​ ఇప్పుడు అదానీ యేనని పేర్కొంది. ఈ గ్రూప్​ మొత్తం మార్కెట్​ క్యాపిటలైజేషన్​ (విలువ) 200 బిలియన్​ డాలర్లపైనేనని వివరించింది.
 
క్లయింట్లు, ఇన్వెస్టర్లు ఆందోళన....

తమతో సహా,  చాలా మంది క్లయింట్లు, ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్​ అప్పులు పెరుగుతుండటం పట్ల కొంత ఆందోళన చెందుతున్నట్లు క్రెడిట్​సైట్స్​ తెలిపింది. ఇలా  మితిమీరి అప్పులు  చేయడం వల్ల గ్రూప్​లోని ఏదైనా ఒకటి లేదా ఎక్కువ కంపెనీలు డిఫాల్ట్​ అయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. తమకు ఏమాత్రం అనుభవం లేని  కాపర్​ రిఫైనింగ్​, పెట్రోకెమికల్స్​, టెలికం, అల్యూమినియం ప్రొడక్షన్​ వంటి రంగాలలోకి అదానీ ఎంటరవడమే ఆందోళనకు కారణమవుతోందని పేర్కొంది. ఈ రంగాలలోని అదానీ గ్రూప్​ కంపెనీలు తీసుకున్న అప్పులను వెంటనే తీర్చడానికి తగినంత లాభాలను సంపాదించలేవని కూడా ప్రస్తావించింది. లాభాలు ఆ వ్యాపారాలలో వెంట వెంటనే రావని స్పష్టం చేసింది. కాబట్టి, తొలి సంవత్సరాలలో  రీఫైనాన్సింగ్​పైనే ఈ గ్రూప్ కంపెనీలు​ ఆధారపడాల్సి రావొచ్చని తెలిపింది. ఇలా ఎప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవాలంటే బ్యాంకింగ్​ సంబంధాలు పటిష్టంగా ఉండాలని, క్యాపిటల్​ మార్కెట్​ పరిస్థితులూ అనుకూలంగా ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.

ఒక మనిషి చూట్టూనే గ్రూప్​.....

60 ఏళ్ల గౌతమ్​ అదానీ ఈ గ్రూప్​లోని ఆరు లిస్టెడ్​ కంపెనీలకు ఛైర్మన్​గా ఉండగా, ఆయన సోదరులు, వారి కొడుకులు బోర్డులో డైరెక్టర్లుగా ఉన్నారు. ఎంట్రప్రెనూరియల్​ జర్నీలో గౌతమ్​ అదానీ విజన్​ గొప్పదేనని, కాకపోతే గ్రూప్​ మొత్తంలో  ఒకే మనిషి (గౌతమ్​ అదానీ) కీలకమవుతున్నారు. దీని వల్ల, రిస్క్​లుండొచ్చని చెబుతూ,  ఆయన లేకుండా గ్రూప్​ కంపెనీలలోని సీనియర్ మేనేజ్​మెంట్​ ఎవరూ వ్యాపారాలను  సమర్ధంగా నిర్వహించలేకపోవచ్చని క్రెడిట్​సైట్స్​ అభిప్రాయపడింది.​ గ్రూప్​ మేనేజ్​మెంట్​ బాధ్యతలను రాబోయే పదేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు కుటుంబంలోని ఇతర సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉందని ఈ రిపోర్టు పేర్కొంది. కాకపోతే, ఈ ప్లాన్స్​ వేటినీ గౌతమ్​ అదానీ ఇప్పటిదాకా బయటకు వెల్లడించలేదని కూడా ప్రస్తావించింది.

అదానీ చేతికి ఎన్​డీటీవీ


ఎన్​డీటీవీలో 29.18 శాతం వాటాలు కొనడానికి అదానీ గ్రూప్​లోని మీడియా కంపెనీ ఓపెన్​ అగ్రిమెంట్​ కుదుర్చుకుంది. మరో 26 శాతం వాటా కొనడానికి ఓపెన్​ ఆఫర్​ను కూడా ప్రకటించనుంది. అదానీ గ్రూప్​ సబ్సిడరీ కంపెనీ ఏఎంజీ మీడియా నెట్​వర్క్స్​ ఇండైరెక్ట్​గా 29.18 శాతం వాటాను ఎన్​డీటీవీలో కొంటోందని, మరో 26 శాతం వాటా కోసం  రూ.493 కోట్లతో ఓపెన్​ ఆఫర్​ ప్రకటించనుందని అదానీ గ్రూప్​ మంగళవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్​డీటీవీ షేరు 5 శాతం పెరిగి రూ.376.55 వద్ద క్లోజైంది.  ఎన్​డీటీవీ 24x7, ఎన్​డీటీవీ ఇండియా, ఎన్​డీటీవీ ప్రాఫిట్​ పేరుతో 3 నేషనల్​ న్యూస్​ ఛానెళ్లు ఎన్​డీటీవీ చేతిలో నడుస్తున్నాయి. ఆన్​లైన్​లోనూ ఎన్​డీటీవీ బాగానే దూసుకెళ్తోంది. అన్ని ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లోనూ కలిపి  ఎన్​డీటీవీకి 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ కంపెనీకి 2022 ఫైనాన్షియల్​ ఇయర్లో రూ.421 కోట్ల రెవెన్యూ మీద రూ.85 కోట్ల  నికరలాభం వచ్చింది.