గుజరాత్లో అదానీ గ్రూపు భారీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టు

గుజరాత్లో అదానీ గ్రూపు భారీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టు
  • ఇది భారత్​లోనే అతిపెద్దదని ప్రకటన
  • కెపాసిటీ 1,126 మెగావాట్లు
  • వచ్చే ఏడాది ప్రారంభం


న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్‌‌లోని ఖావ్దాలో 1,126 మెగావాట్ల/3,530 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్​ (బీఈఎస్​ఎస్​) ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది.  ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్​ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటని పేర్కొంది. 700కు పైగా బీఈఎస్​ఎస్​ కంటైనర్లతో కూడిన ఈ సదుపాయం వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది.  ఖావ్దా ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్​ఎనర్జీ ప్లాంట్‌‌ అవుతుందని అదానీ వర్గాలు తెలిపాయి. అయితే పెట్టుబడి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

 క్లీన్​ఎనర్జీ వాడకాన్ని పెంచడానికి, బ్యాకప్​ విద్యుత్​ అందించడానికి, గ్రిడ్​ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి బ్యాటరీ స్టోరేజ్​కీలకం. సౌర, పవన శక్తిలాంటి వనరుల నుంచి ఉత్పత్తి అయిన కరెంటును నిల్వ చేసి, ఆ వనరులు అందుబాటులో లేనప్పుడు (రాత్రి లేదా తక్కువ గాలి వీచినప్పుడు) ఉపయోగించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు పీక్​ లోడ్​ ఒత్తిళ్లను, ట్రాన్స్​మిషన్​ రద్దీని తగ్గిస్తుంది. నిరంతరం క్లీన్​ పవర్​ను​ సరఫరా చేయగలుగుతుంది. ప్రాజెక్టు కోసం అధునాతన లిథియం- అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. బీఈఎస్​ఎస్​ ప్రాజెక్టుకు 1126 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం, 3,530 మెగావాట్ల శక్తి సామర్థ్యం ఉంటుంది. అంటే, ఇది​ 3,530 మెగావాట్ల శక్తిని నిల్వ చేయగలదు.   గ్రిడ్​కు నిరంతరాయంగా 1,126 మెగావాట్ల విద్యుత్​ను సరఫరా చేయగలుగుతుంది.

ఎనర్జీ స్టోరేజీ కీలకం..

 బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ భవిష్యత్తుకు కీలకమని అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్ అదానీ అన్నారు.  ఈ చారిత్రక ప్రాజెక్టుతో తాము ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించగలుగుతామని,  సమర్థవంతమైన, పరిశుభ్రమైన, తక్కువ ధర గల విద్యుత్​ను అందిస్తామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్​ తన స్టోరేజ్​ సామర్థ్యాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 15 గిగావాట్లకు, ఐదేళ్లలో 50 జీగావాట్లకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది.   ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున స్టోరేజ్​ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టే గ్లోబల్ ఎనర్జీ లీడర్ల సరసన చేరింది.