భారీగా పెరిగిన అదానీ స్టాక్స్​

 భారీగా పెరిగిన అదానీ స్టాక్స్​

ముంబై :  బెంచ్‌‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి.   విదేశీ నిధుల ప్రవాహం, ఆటో, పవర్,  మెటల్ షేర్లలో చివరి గంటలో కొనుగోళ్లు జరగడంతో  సెన్సెక్స్ 204.16 పాయింట్లు శాతం పెరిగి 66,174.20 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది గరిష్టంగా 66,256.20,  కనిష్ట స్థాయి 65,906.65ను తాకింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 19,889.70 వద్ద స్థిరపడింది. ఇందులోని 39 కంపెనీలో లాభాల్లో, 11 నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌‌ కంపెనీల్లో టాటా మోటార్స్‌‌, బజాజ్‌‌ ఫిన్‌‌సర్వ్‌‌, అల్ట్రాటెక్‌‌ సిమెంట్‌‌, భారతీ ఎయిర్‌‌టెల్‌‌, బజాజ్‌‌ ఫైనాన్స్‌‌, ఎన్‌‌టీపీసీ, టైటాన్‌‌, యాక్సిస్‌‌ బ్యాంక్‌‌లు లాభపడ్డాయి. ఐటీసీ, హిందుస్థాన్‌‌ యూనిలీవర్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌, పవర్‌‌ గ్రిడ్‌‌లు వెనుకబడ్డాయి. 

బ్రాడ్​ మార్కెట్‌‌లో, బీఎస్​ఈ మిడ్‌‌క్యాప్ గేజ్ 0.30 శాతం ఎగబాకగా, స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.06 శాతం లాభపడింది. సూచీలలో యుటిలిటీస్ 3.64 శాతం, పవర్ 3.47 శాతం, ఆయిల్ అండ్​ గ్యాస్ 3.13 శాతం, ఎనర్జీ 2.27 శాతం, సేవలు 2.02 శాతం, కమోడిటీలు 1.27 శాతం, మెటల్ 1.13 శాతం పెరిగాయి. ఎఫ్‌‌ఎంసీజీ, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్,  క్యాపిటల్ గూడ్స్ వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్  షాంఘై లాభాలతో స్థిరపడగా, టోక్యో,  హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు  దిగువన ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌కు 1.19 శాతం పెరిగి 80.93 డాలర్లకు చేరుకుంది. 

 భారీగా పెరిగిన అదానీ స్టాక్స్​

అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్​దూసుకెళ్లాయి.   పెట్టుబడిదారులు మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల కౌంటర్లకు తరలి వచ్చారు. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.06 శాతం, అదానీ పవర్ 12.32 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 12.27 శాతం, ఎన్‌‌డీటీవీ 11.73 శాతం, అదానీ విల్మార్ 96 శాతం, అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ 9 శాతం పెరిగాయి.  అదానీ పోర్ట్స్ 5.20 శాతం, అంబుజా సిమెంట్స్ 4.22 శాతం, ఏసీసీ 2.62 శాతం పెరిగాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 10 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.11.31 లక్షల కోట్లకు ఎగబాకింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి దాదాపు ఇది రూ.10.26 లక్షల కోట్లు ఉంది.