
న్యూఢిల్లీ: ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 2026 ఆర్థిక సంవత్సరంకి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.7శాతం నుంచి 6.5శాతానికి తగ్గించింది. వాణిజ్య అనిశ్చితి, పెరిగిన యూఎస్ సుంకాల వల్ల ఎగుమతులపై, పెట్టుబడులపై ప్రభావం చూపడం దీనికి కారణమని పేర్కొంది. అయితే, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని పేర్కొంది. ఏడీబీ రిపోర్ట్ ప్రకారం.. దేశీయ వినియోగం, గ్రామీణ డిమాండ్ ఊపందుకున్నాయి.
సేవా రంగం, వ్యవసాయ రంగాల మద్దతుతో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని అంచనా. సాధారణ వర్షపాతం వ్యవసాయ రంగానికి కీలకం. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.5శాతంగా నమోదయింది. ఇది నాలుగు సంవత్సరాలలో అతితక్కువ. ప్రభుత్వ ఆర్థికస్థితి బలంగా ఉంది. ఆర్బీఐ నుంచి భారీ డివిడెండ్లు వచ్చాయి. 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.7శాతానికి మెరుగుపడుతుందని అంచనా. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ఆర్బీఐ రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది.