డిన్నర్ లో మత్తు మందు కలిపి..  బంగారం, డబ్బులతో పరారైన నేపాలీ గ్యాంగ్

డిన్నర్ లో మత్తు మందు కలిపి..  బంగారం, డబ్బులతో పరారైన నేపాలీ గ్యాంగ్

గచ్చిబౌలి, వెలుగు: ఇంటి ఓనర్లకు డిన్నర్ లో మత్తు మందు కలిపి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గం బీఎన్ఆర్ హిల్స్ కాలనీలో బోర్ వెల్ వ్యాపారం చేసే గూడూరు మధు సూధన్ రెడ్డి(55), అతని భార్య శైలజ(50), కుమారుడు నితీశ్ రెడ్డి(35), కోడలు దీప్తిరెడ్డి(32) మనుమడు అయాన్ రెడ్డి(5)తో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో నేపాల్ కు చెందిన రాజేందర్ అలియాస్ రవి, తన సోదరి సీతతో రెండేళ్ల క్రితం ఇంటి, వంట పని చేసేందుకు చేరారు. పదిహేను రోజుల క్రితం నేపాల్ కు చెందిన మనోజ్, జానకీలను తీసుకువచ్చి అదే ఇంట్లో పనిలో చేర్చాడు. మనోజ్ హౌస్ కీపింగ్ పనులు చేస్తుండగా, జానకి వంట పనిచేస్తుండేది. వీరందరికి సెల్లార్ లో సర్వెంట్ క్వార్టర్ లో రూం ఇచ్చాడు ఇంటి యజమాని.

పక్కా ప్లాన్ తోనే…

పక్కా ప్లాన్ తోనే సినిమాను తలపించే రీతిలో మధుసూదన్ రెడ్డి ఇంట్లో నేపాలీ గ్యాంగ్ ఈ దొంగతనం చేశారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పప్పులో మత్తు మందు కలిపారు. కుటుంబ సభ్యులంతా చపాతీతో పప్పు తినగా, మధుసూధన్ రెడ్డి భార్య శైలజ మాత్రం తినలేదు. శైలజకు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. దీంతో వీరంతా స్పృహ కోల్పోయారు. శైలజను కుర్చీలో కూర్చోపెట్టి తాడుతో కట్టి వేశారు. ఇదే అదునుగా భావించిన ఈ నేపాలీ గ్యాంగ్ బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరితో ఇంట్లో ఉన్న 15 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలను, సీసీ కెమెరాల డీవీఆర్ ను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం చిన్నారి అయాన్ రెడ్డి నిద్ర లేచి నానమ్మ శైలజ కట్లు విప్పాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్పృహ కోల్పోయిన మధుసూధన్ రెడ్డి, నితీశ్ రెడ్డి, దీప్తిరెడ్డిలను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెం కటేశ్వర్లు, ఏసీపీ రఘునందర్ రావు పరిశీలించారు. నిందితుల కోసం 4 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.