- విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గతంలో ఆదేశించిన మేరకు పిటిషనర్‌కు చెల్లించాల్సిన బకాయిలపై సానుకూల నిర్ణయం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఇద్దరు ఐఏఎస్‌లతోపాటు పలువురు అధికారులకు హైకోర్టు ఫాం–1 నోటీసులు జారీ చేసింది. జనవరి 9న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఈవీ వేణు గోపాల్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం, కరీంనగర్ రీజియన్ ఎస్‌ఈ లచ్చయ్య, రహమాన్, నర్సింహారావు స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
సివిల్ పనుల బకాయిలు చెల్లించలేదంటూ కె.ఆనంద్ అండ్ కంపెనీ వేసిన పిటిషన్‌ను గత ఏప్రిల్‌లో విచారించిన న్యాయమూర్తి.. బకాయి రూ.1.16 కోట్లను ఆరు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఉత్తర్వులు వెలువడి 3 నెలలు గడిచినా అమలు కాలేదంటూ ఆ సంస్థ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ తరఫు లాయర్ డీఎల్ పాండు వాదించారు.
ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని, బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, కరీంనగర్ జిల్లా ఎస్‌ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ జులై 11, ఆగస్టు 14, ఆగస్టు 29, సెప్టెంబర్ 19, అక్టోబర్ 16, నవంబర్ 3, నవంబర్ 7, నవంబర్ 21న జరిగిన విచారణలకు స్వయంగా హాజరయ్యారై నప్పటికీ కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విచారణ జనవరి 9కి వాయిదా వేశారు.
