న్యూఢిల్లీ: పొత్తి కడుపు గాయం నుంచి కోలుకున్న టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బుధవారం ముంబైలో దాదాపు గంటసేపు ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేశాడు. దాంతో క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు తొలి అడుగు వేశాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌కు తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీని నుంచి కోలుకునే క్రమంలో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం గాయంపై పూర్తి స్థాయి అంచనా కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కి వెళ్లనున్నాడు. ఇప్పటికైతే ఎప్పుడు బరిలోకి దిగుతాడనే దానిపై స్పష్టమైన తేదీని చెప్పడం కష్టంగానే ఉన్నా.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నాడు. అయితే సీవోఈ ఇచ్చే నివేదికలపై ఇది ఆధారపడి ఉంటుంది. ‘ఆసీస్‌లో శ్రేయస్‌కు గాయం కావడం దురదృష్టకరం. అతను పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఎలాంటి నొప్పి లేకపోవడంతో ముంబైలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఇది మంచి సంకేతం. టీమిండియా తర్వాతి సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. దానికి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకంటే ముందే విజయ్ హజారేలోనూ ఆడాలని భావిస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. సీవోఈలో శ్రేయస్ నాలుగు నుంచి ఆరు రోజులు ఉండనున్నాడు. అక్కడే అన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికైతే సాధారణ జిమ్, ఫిట్‌నెస్ సెషన్లను ప్రారంభించాడు.
