మూడో విద్యుత్ డిస్కం.. సబ్సిడీ సంకటాన్ని తీర్చగలదా?

మూడో  విద్యుత్ డిస్కం.. సబ్సిడీ సంకటాన్ని  తీర్చగలదా?

భారతీయ విద్యుత్ రంగ చరిత్రలో అపూర్వమైన నిర్ణయాన్ని డిసెంబర్ 17, 2025న  తెలంగాణ కేబినెట్​ ఆమోదించింది. వ్యవసాయం, ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఏర్పాటు కానుంది.  మొత్తం రాష్ట్ర విద్యుత్ శక్తి వాడకంలో 42% ఈ సంస్థ నిర్వహించబోతున్నది.  దాదాపు 29 లక్షల వినియోగదారులు.  కేవలం ఉచిత విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక సంస్థ ఈ మూడో డిస్కం.

విద్యుత్ పాలనలో  ఈ  కొత్త సంస్థ ఏర్పాటు నూతన సంస్థాగత వ్యవస్థకు  నాంది  పలుకుతున్నది. విద్యుత్ రంగంలో గందరగోళంగా ఉన్న ఆర్థిక లావాదేవీలు, అప్పులు, బకాయిలు, సంస్థల మధ్య సంబంధాల నేపథ్యంలో  కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఒక ఆసక్తికర నిర్ణయం.  లోతుగా చూస్తే దశాబ్దాలుగా భారతీయ విద్యుత్ విధానాన్ని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఒక నూతన ప్రయత్నంగా అర్థమవుతుంది.  

రూ.45,000 కోట్ల రహస్యం

తెలంగాణలో ఇప్పటికే  ఉన్న రెండు  విద్యుత్  పంపిణీ కంపెనీల (డిస్కంల) మీద ఉన్న  బకాయిల భారం రూ.45,398 కోట్లు.  ఇందులో అధికశాతం  రూ.35,982 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ( రూ.22,926 కోట్లు), నీటి సరఫరా యుటిలిటీలు ( రూ.13,056 కోట్లు), ఇతర  కొత్త  డిస్కంకు  బదిలీ అవుతున్నవి.  ఇవి వాణిజ్య అప్పులు కావు. - నిజాయితీగా లెక్కించని రాజకీయ వాగ్దానాల  సంచిత ఖర్చులు.  ఇంతేనా,  ఇంకా ఏమైనా ఉన్నదా అన్నది ముందుముందు తెలుస్తుంది.  

విద్యుత్  సరఫరా మేరకు బిల్లింగ్ చేయకపోవడం,  వాస్తవ ఖర్చుల మధ్య అంతరం వల్ల ఏర్పడుతున్న  ‘ప్రమాదకరమైన ఆర్థిక స్థితి’తో  కునారిల్లుతున్న  డిస్కంలు  మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి లేదా కేంద్ర పథకాలను పొందడం లేదని ప్రభుత్వం అంగీకరిస్తున్నది.  కనపడుతున్న అంతరమే కాకుండా,  దొంగతనం, సాంకేతిక అసమర్థత లేదా కేవలం ఉచిత విద్యుత్ ఖర్చు వగైరా అంశాలలో దేని వలన డిస్కంలకు ఆర్థిక నష్టాలు వస్తున్నాయో ఎవరికీ తెలియదు.

పారదర్శకత ఒక పరిష్కారం

 మూడో  డిస్కం ఏర్పాటు వల్ల వచ్చే ప్రాథమిక విజయం గతంలో కొలవలేని దానికి కొలత సృష్టించడం.  ఇందులో కేంద్ర బిందువు మూడో డిస్కం పరిధిలో 5,22,479  వ్యవసాయ  ట్రాన్స్‌‌ఫార్మర్లకు  బిగించబోయే స్మార్ట్ మీటర్లకు రూ.1,306 కోట్ల పెట్టుబడి.  ఈ ఇంటర్‌‌ఫేస్  మీటర్లు  వ్యవసాయ విద్యుత్  సరఫరాను కొలుస్తాయి.

విద్యుత్  ట్రాన్స్‌‌ఫార్మర్లకు మీటర్లు బిగించమని ఇదివరకు అనేకసార్లు సూచనలు ఇచ్చినా చేయలేదు. బిగించకపోవటానికి సహేతుక కారణం ఏమీ లేదు.  ఇవి బిగిస్తే,  మొదటిసారిగా  తెలంగాణలో వ్యవసాయ రంగం ఎంత విద్యుత్​ను  వినియోగిస్తుందో  తెలుస్తుంది.  నిజమైన నెలవారీ సబ్సిడీ ఖర్చు తెలుస్తుంది.  

‘పంపిణీ నష్టాలు’ సాంకేతిక  సమస్యలా లేదా మీటర్  లేని వినియోగమా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది.  ప్రభుత్వానికి ఇదివరకు మాదిరి గంపగుత్త  లెక్కలలో  దాచలేని నెలవారీ గణన వస్తుంది. విద్యుత్ సబ్సిడీ పట్ల రాజకీయ హామీలు, బడ్జెట్ కేటాయింపులు వాస్తవ వినియోగాన్ని ప్రతిబింబించే ఏర్పాటు ఈ మూడో డిస్కం వలన కలుగుతుంది.

అవినీతి

భారీ పరివర్తనలు అవినీతికి అవకాశాలను సృష్టిస్తాయి. ఈ  డిస్కం 1 ఏప్రిల్ 2026 నుంచి పని మొదలు పెట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులో  పేర్కొన్నారు. అంటే ప్రాథమికంగా  రూ. 4,929 కోట్ల ఆస్తులు,  రూ.35,982 కోట్ల బకాయిలు బదిలీ చేయడం,  రూ.1,306 కోట్ల స్మార్ట్ మీటర్  కాంట్రాక్టులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఏప్రిల్ నాటికి ఇవి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 4 నెలల వ్యవధి ఉన్నది. ఏదేమైనా, ఈ ప్రక్రియ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా జరిగితే మంచిది.  ఆస్తి విలువ అంచనా కూడా ఒక కీలక అంశం.  30 సంవత్సరాల నాటి పాత మౌలిక సదుపాయాల విలువ ఏ విధంగా కడతారు? విలువ అంచనాలలో 10% తారుమారు అంటే బ్యాలెన్స్ షీట్ల మధ్య  రూ.500 కోట్లు మారతాయి. ఈ ప్రక్రియ ఎంత శాస్త్రీయంగా,  పారదర్శకంగా,  జవాబుదారీతో  కూడినదైతే అంత మంచిది.
స్మార్ట్ మీటరుకు రూ.25,000 చొప్పున 5,22,479  ట్రాన్స్‌‌ఫార్మర్ యూనిట్లకు బిగించాల్సిన మీటర్లలో డిజైన్ స్పెసిఫికేషన్, నాణ్యత ధృవీకరణ, క్యాలిబ్రేషన్ చేయడం వంటి పనులు కీలకం. 

కొన్ని వాస్తవాలు

మూడో డిస్కం  ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా? కచ్చితంగా ఆర్థిక సుస్థిరత ఉండదు.  ఒకవైపు సున్నా ఆదాయం. ఇంకొక వైపు సుమారు 31,000-–35,000 మిలియన్ యూనిట్ల వార్షిక విద్యుత్ కొనుగోలు, వీలింగ్,  నిర్వహణకు యూనిట్‌‌కు  రూ.5-6 అంచనా వేస్తే, వార్షిక నిర్వహణ ఖర్చు  రూ.15,500-–21,000 కోట్లు అవుతుంది.  వ్యవసాయ విద్యుత్  వినియోగం అనిశ్చితం.  కరువు ఉంటే విద్యుత్ వినియోగంలో 15–-20% పెరుగుదల ఉంటుంది.

అధిక వర్షపాతం ఉంటే  భారీగా తగ్గవచ్చు.   ప్రస్తుతం ఉన్న 489  లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టులు ప్రతిరోజూ మారుతున్న నదీ ప్రవాహంపై ఆధారపడి ఉంటాయి. ధరలనుబట్టి మారే వాణిజ్య వినియోగం మాదిరిగా కాకుండా, వ్యవసాయ విద్యుత్ డిమాండ్ వాతావరణ పరిస్థితులు, పంటల సరళిని బట్టి ఉంటుంది. 

ఏమి చెయ్యాలి?

వ్యూహాత్మక చర్యలు లేకుంటే కొత్త డిస్కం వల్ల ప్రయోజనం ఉండదు. కావలసినవి..  సౌర  వ్యవసాయ ఫీడర్లు. ఇవి పగటిపూట విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి.  తప్పనిసరి  మరమ్మతు ఒప్పందాలు, 24- గంటల  ప్రతిస్పందన లేకుంటే  రైతుకు పరిహారం చెల్లించాలి.  వాతావరణ- సూచిక ఆధారంగా విద్యుత్ కొనుగోలు చేయాలి.  

ప్రత్యక్ష బడ్జెట్ కేటాయించాలి.  మెరుగైన ఉపయోగానికి సబ్సిడీలు,  మెరుగైన పంపుల వాడకానికి ప్రోత్సాహం కల్పించాలి.  ఇటువంటి ప్రణాళికలు కొరవడితే మూడో డిస్కం వైఫల్యంగా మారుతుంది. కొత్త డిస్కం ప్రయోగం సఫలమైతే ఈ మోడల్  ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకంగా మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటకకు వ్యాపించవచ్చు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇలాంటి డిస్కం అప్పులు, వ్యవసాయ  సబ్సిడీ  సమస్యలను ఎదుర్కొంటున్నాయి.  

పంటల ఉత్పత్తిలో విద్యుత్  వినియోగం మెరుగుపరచడం, కాలానుగుణ  అస్థిరతను  సమర్థంగా ఎదుర్కోవడం, మరమ్మతుల  వ్యవస్థను  పటిష్టపరచడం,  తాగునీటి  పంపింగ్ శాశ్వత ఆర్థిక బాధ్యతగా అంగీకరించడం వంటివి కష్టతరమైన మార్పులు అవసరం. 

మెరుగులు ఎక్కడ?

విద్యుత్ పాలనలో వచ్చే మార్పులు వల్ల ఒనగూరే ప్రయోజనాలు గణనీయమైనవి.  ప్రస్తుత డిస్కం బ్యాలెన్స్ షీట్ల  నుంచి రూ.41,239 కోట్ల బకాయిలను తొలగించడం వల్ల అవి రుణాలు తీసుకోవడానికి  అర్హత సంపాదిస్తాయి.   ప్రైవేట్ మూలధనం, కేంద్ర పథకాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడికి అర్హత పొందుతాయి.  

తెలంగాణ  విద్యుత్  నియంత్రణ కమిషన్ ఇప్పుడు విభిన్న నియమాలను నిర్దేశించవచ్చు.  కానీ, వనరుల ఉపయోగ సామర్థ్యంలో లాభాలు మాత్రం ప్రశ్నార్థకం. ట్రాన్స్‌‌ఫార్మర్లపై  స్మార్ట్ మీటర్లు మొత్తం వినియోగాన్ని కొలుస్తాయి కానీ, వ్యక్తిగత వినియోగ తీరును మార్చవు.  ప్రతి రైతుకు  ‘ఉచిత విద్యుత్’ మూడో  డిస్కం ఏర్పాటు తరువాత  కూడా కొనసాగుతుంది. 

కాకపోతే  కొందరు కోరుకుంటున్నట్టు వ్యక్తిగత మీటరింగ్ (29 లక్షల కనెక్షన్లకు), సమయ ఆధారిత ధర నిర్ణయం రాజకీయంగా అసాధ్యం.  లేదా పంపు సామర్థ్య కార్యక్రమాలు, వినియోగం తీరు వంటివి కొత్త డిస్కం ఏర్పాటు వల్ల కూడా సాధ్యం కాదు. దానికి ప్రత్యేక  కసరత్తు అనివార్యం.  

15 జిల్లాల్లో దక్షిణ డిస్కంతో,   18 జిల్లాలలో  ఉత్తర డిస్కంతో  ఈ  మూడో  డిస్కం  కలిసి పని చెయ్యాలి. ఇంటర్‌‌ఫేస్  మీటరింగ్ వివాదాలు, అత్యవసర  ప్రతిస్పందన, మూడు డిస్కంల విద్యుత్ కొనుగోలు వంటివి సమన్వయం లేకపోతే సంక్లిష్టంగా మారతాయి. రైతులకు అందాల్సిన సేవలలో గందరగోళం రావచ్చు. 

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-