
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో జరిగిన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులను స్వీకరించి వాటిలో కొన్నింటిపై అప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించారు. మిగతా వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాంతాల మధ్య విబేధాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాలను బీఆర్ఎస్ గబ్బు పట్టిస్తుందని ధ్వజమెత్తారు.