బడ్జెట్‌లో ఓయూకు అదనంగా రూ.39 కోట్లు

బడ్జెట్‌లో ఓయూకు అదనంగా రూ.39 కోట్లు

బడ్జెట్ లో గతేడాదితో పోల్చితే ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అదనంగా రూ.39 కోట్లు కేటాయించడంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓయూ పరిపాలనా భవన్ లోని సెనెట్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన... న్యాక్ గుర్తింపు ప్రక్రియలో మెరుగైన ర్యాంక్ సాధించడంపై ఆయా విభాగాల ప్రిన్సిపాల్స్, డీన్స్, విభాగాధిపతులు, డైరెక్టర్లు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు. న్యాక్ గుర్తింపు ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని సకాలంలో సమర్పించడంలో సహకరించాలని అధ్యాపకులకు సూచించారు. 

ఓయూతో సంబంధంలేని కొంతమంది వ్యక్తులు ఇటీవల క్యాంపస్ వాతావరణాన్ని కలుషితం చేయటంతో పాటు పీహెచ్ డీ ప్రవేశాల ప్రక్రియపై దుమారం సృష్టించటాన్ని అధ్యాపకులు ఏకగ్రీవంగా ఖండించారు. యూజీసీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే పి.హెచ్.డి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ పాలకవర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, బోధన, పరిశోధన, పరిపాలనలో విశ్వవిద్యాలయ ప్రతిష్టను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని వైస్ ఛాన్సలర్, రిజిస్జ్రార్ లు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గత మూడు దశల్లో న్యాక్ మూల్యాంకన ప్రక్రియలో ఓయూకు నిలకడగా ఉన్నత గ్రేడ్ లు సాధించటానికి కృషి చేసిన ఐక్యూఏసీ(IQAC) సభ్యులు, వాటాదారులందరినీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ అభినందించారు.