ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ చంద్రశేఖర్

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు :  కలెక్టర్ చంద్రశేఖర్
  • అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు : ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని అడిషనల్ కలెక్టర్​చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం అమీన్​పూర్​ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని ఈద్గా ముందు నిర్మాణాలను ఆయన పరిశీలించారు. సర్వే నంబర్ 164 లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలపై ఆయన సీరియస్ అయ్యారు. మధుసూదన్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిలో చేస్తున్న నిర్మాణాలను కూల్చి వేయాలని లోకల్​ అధికారులను ఆదేశించారు.

అనంతరం స్థానిక పంచాయతీ అధికారులు జేసీబీలతో అక్కడ నిర్మాణాలను కొన్నింటిని కూల్చి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమలు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, గవర్నమెంట్ జాగల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. అక్రమాలను సక్రమం చేయాలనుకునే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్థానిక, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాధ, ఎంపీడీవో  శ్రీరామ్, ఎంపీవో రాజ్​కుమార్, ఆర్ఐ రఘునాథ్​రెడ్డి, ఈవో బలరాం ఉన్నారు.