డయేరియా విస్తరించకుండా చర్యలు చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

డయేరియా విస్తరించకుండా చర్యలు చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

నిర్మల్, వెలుగు: జిల్లాలో డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మల్ ​అడిషనల్ (స్థానిక సంస్థలు) కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. డయేరియాను నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్​లో అధికారులతో చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆహారం, నీరు, పారిశుధ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 16నుంచి జూలై 31 వరకు ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్​నైట్ (ఐడీసీఎఫ్) కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. ఇటుక బట్టీలు, గిరిజన తండాలు, సంచార జాతులు నివాసముండే ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా వైద్యసేవలు అందించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, డీఎంహెచ్‌వో డా.రాజేందర్, ఆర్డీవో రత్నకల్యాణి, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు తదితరులుపాల్గొన్నారు.